చెవిటి వాడి ముందు శంఖం ఊదడం ఇదే!

9 Jan, 2020 19:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దాదాపు మూడువేల మందిపైన ‘దేశ ద్రోహం’ నేరం కింద జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ పోలీసులు మంగళవారం కేసు పెట్టారు. వాటన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు మరుసటిరోజే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న హక్కుల గురించి రాసిన శిలా ఫలకాలను ఊరూరా ఏర్పాటు చేసినందుకు గత నవంబర్‌లో కూడా పదివేల మందిపై కుంతీ జిల్లా పోలీసులు ‘దేశ ద్రోహం’ నేరం కిందనే కేసులు పెట్టారు. వాటిని గత నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్‌ సోరెన్‌ కేబినెట్‌ నిర్ణయం తర్వాత కొట్టివేశారు. 

ఇలా తప్పుడు కేసులు పెట్టడం తప్పంటూ ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరించి వాటిని ఎత్తివేసినప్పటికీ జార్ఖండ్‌ పోలీసులు తమ వైఖరి మార్చుకోక పోవడం ఆశ్చర్యం. బ్రిటీష్‌ వలస పాలకుల కాలం నాటి మనస్తత్వం నుంచి ఇంకా బయట పడడం లేదు. ఈ మనస్తత్వం ఒక్క జార్ఞండ్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా, వాటిపై నిరసన వ్యక్తం చేసినా అరెస్టులు చేసి దేశ ద్రోహం నేరం కింద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇలా తప్పుడు కేసులు పెట్టి క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్నారంటూ కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం లేదు. 2014 నుంచి 2016 మధ్య దేశంలో కొన్ని వందల మంది మీద దేశ ద్రోహం నేరం కింద కేసులు పెట్టగా వాటిలో రెండంటే రెండు కేసులు మాత్రమే నిలబడ్డాయి. మిగితా వాటన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. 

‘ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం ఎన్నటికీ కాదు. పైగా అది భావ ప్రకటనా స్వేచ్ఛ కింద రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు’ అని 1962లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. 2016లో కూడా దేశ ద్రోహం కేసులు తన దృష్టికి వచ్చినప్పుడు ఈ తీర్పునే పునరుద్ఘాటించింది. ఇలాంటి తీర్పులన్నీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అవుతున్నాయి.

మరిన్ని వార్తలు