పౌర నిరసనలు : ‘పోలీసులే దొంగలయ్యారు’

19 Jan, 2020 14:25 IST|Sakshi

లక్నో : నెల రోజులపాటు ఉధృతంగా సాగిన పౌరసత్వ నిరసనలు మరోసారి మొదలయ్యాయి. లక్నోలోని క్లాక్‌ టవర్‌ వద్ద శుక్రవారం రాత్రి సీఏఏకు వ్యతిరేకంగా సుమారు 50 మంది మహిళలు, విద్యార్థులు నిరవధిక నిరసనకు దిగారు. నిరసనకారుల సంఖ్య శనివారానికి మరింత పెరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. అయితే, పోలీసుల తీరు దొంగల మాదిరిగా ఉందని నిరసనకారులు విమర్శిస్తున్నారు. ధర్నా జరిగే చోటు నుంచి బ్లాంకెట్లు, ఆహార పదార్ధాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లక్నో పోలీసులు స్పందించారు.

ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్లాక్‌ టవర్‌ వద్ద ఆందోళన చేపట్టారని పోలీసులు తెలిపారు. టెంట్లు వేసేందుకు నిరసనకారులు ప్రయత్నించారని, అందుకనే వారి వద్ద నుంచి బ్లాంకెట్లు, ఇంతర సామాగ్రిని సీజ్‌ చేశామని వెల్లడించారు. వందల కొద్దీ బ్లాంకెట్లను పంచి పెడుతుండగా.. అడ్డుకుని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఇదిలాఉండగా.. పోలీసులు బ్లాంకెట్లు, టిఫిన్‌ బాక్స్‌లు తీసుకెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు