క్యాబ్‌ డ్రైవర్‌కు ఫైన్‌..ఎందుకో తెలిస్తే మనమూ షాక్‌

10 Oct, 2017 12:23 IST|Sakshi

హుబ్లి : నవీన్‌... హుబ్లికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌. ఎప్పటిలాగానే అతను తన ప్యాసెంజర్లను ఎక్కించుకోవడానికి సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి గోకుల్‌ రోడ్డు వైపుకు వెళ్తున్నాడు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు అతని కారును ఆపారు. డాక్యముంట్లన్నీ చూపించమన్నారు. డ్రైవర్‌ లైసెన్స్‌తో పాటు అన్ని రకాల డాక్యుమెంట్లను నవీన్‌ వారి ముందు ఉంచాడు. అయినప్పటికీ రూ.100 జరిమానా విధించారు. రూ.100 జరిమానా ఎందుకో చూసిన నవీన్‌కు దిమ్మతిరిగిన పని అయింది. డ్రైవింగ్‌ చేస్తూ హెల్మెంట్‌ పెట్టుకోలేదని అతనిని ఈ ఫైన్‌ పడింది. ఈ ఘటన అక్టోబర్‌ 7న చోటుచేసుకుంది. 

పోలీసులు తనని దూషించడం ప్రారంభించారని, జరిమానా కట్టాలంటూ బలవంత పెట్టారని నవీన్‌ చెప్పాడు. అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించినప్పటికీ ఎందుకు ఫైన్‌ వేస్తున్నారని అడిగిప్పటికీ, వారు తనని పట్టించుకోలేదన్నాడు. తొలుత రూ.500 అడిగారని, కానీ తాను ససేమిరా అనడంతో రూ.100 జరిమానాతో విడిచిపెట్టారని చెప్పాడు. అయితే జరిమానా విధించిన బిల్లును చూసి మాత్రం తాను షాక్‌కు గురయ్యాయని,  కేఏ 25డీ 2271 నెంబర్‌ గల కారు డ్రైవర్‌ హెల్మెంట్‌ లేకుండా డ్రైవ్‌ చేస్తుండటంతో జరిమానా విధించినట్టు ఉందన్నాడు. నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్‌ కాన్సిస్టేబుల్‌ ఈ జరిమానా విధించినట్టు తెలిసింది. హుబ్లి-దార్వడ్‌ పోలీసు కమిషన్‌ ఎం ఎన్‌ నాగరాజ్‌ను సంప్రదించగా..ఈ విషయంపై విచారణ జరుపుతామన్నారు. ఒకవేళ ఆ పోలీసు ఆఫీసర్‌ లంచం తీసుకున్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కారు డ్రైవర్‌ హెల్మెంట్‌ పెట్టుకోలేదని జరిమానాలు విధించడం ఇదే మొదటిసారి కాదని, పలుసార్లు ఇలా జరిమానాలు విధిస్తున్నారని తెలిసింది. 

మరిన్ని వార్తలు