ఆనకట్టల భద్రతకు ఆమోదం

14 Jun, 2018 01:23 IST|Sakshi

వ్యవసాయ ఉన్నత విద్యకు రూ. 2,225 కోట్లు

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు   

న్యూఢిల్లీ: డ్యాములు, నీటి రిజర్వాయర్ల రక్షణ కోసం ఉద్దేశించిన ఆనకట్టల భద్రత బిల్లు – 2018కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఆనకట్టల భద్రతకు పాటించాల్సిన విధానాలపై పరిశోధనలు జరిపి సిఫారసులు చేసేందుకు జాతీయ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. దేశంలో ఆనకట్టల భద్రతా ప్రమాణాలపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు, నిబంధనలను అమలు చేసేందుకు జాతీయ ఆనకట్టల రక్షణ సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో పొందుపరిచామన్నారు. ఆనకట్టల రక్షణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకే రకమైన భద్రతా విధానాలను పాటించేందుకు కూడా బిల్లు తోడ్పడుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది.

మంత్రివర్గ ఇతర నిర్ణయాలు
► ఉన్నత వ్యవసాయ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2020 వరకు మొత్తంగా 2,225.46 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌), నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (ఏన్‌ఏఏఆర్‌ఎం), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వుమెన్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ (సీఐడబ్ల్యూఏ) తదితర సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి.

► ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు – 2013ను వెనక్కు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. బిల్లులోని ప్రతిపాదిత మార్పులను విశ్వవిద్యాలయ పాలక మండలితో చర్చించి తుది నిర్ణయానికి రావాలన్న కారణంతో ఈ బిల్లును ఉపసంహరించుకోనున్నారు.  

► కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) ఉప వర్గీకరణ అంశంపై పరిశీలన జరుపుతున్న కమిటీకి మంత్రివర్గం ఈ ఏడాది జూలై వరకు పొడిగింపునిచ్చింది.

►ఈశాన్య మండలికి అధ్యక్షుడిగా ఇకపై కేంద్ర హోం మంత్రి ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఈశాన్య మండలికి అధ్యక్షుడిగా ఉంటుండగా, ఇకపై ఆ శాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

►ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ వద్ద హోటల్‌ను నిర్మించేందుకు 3.7 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు సంస్థకు 99 ఏళ్ల పాటు అద్దెకివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

►వైద్య, ఆరోగ్య రంగాల్లో పరిశోధన కోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)తో ఫ్రాన్స్‌లోని ఐఎన్‌ఎస్‌ఈఆర్‌ఎం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మంత్రివర్గం చర్చించింది.  

మరిన్ని వార్తలు