‘మత్స్య సంపద’కు 20 వేల కోట్లు

21 May, 2020 05:33 IST|Sakshi

మరో మూడేళ్ల పాటు ప్రధాన మంత్రి వయ వందన యోజన

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ:  మత్స్య రంగ సమగ్ర అభివృద్ధి ద్వారా నీలి విప్లవం సాధించేందుకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)’కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 20,050 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర వాటా రూ. 9,407 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ. 5763 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకాన్ని 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల పాటు అమలు చేస్తారు.

15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం, మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం, చేపల ఉత్పత్తిని 2024–25 నాటికి 2.2 కోట్ల టన్నులకు పెంచడం ఈ పథకం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం మత్స్య రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ పథకంలో రెండు విభాగాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అవి సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌(సీఎస్‌), సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్‌(సీఎస్‌ఎస్‌). సీఎస్‌లో మొత్తం ప్రాజెక్టు ఖర్చును కేంద్రం భరిస్తుంది.

కేబినెట్‌ ఆమోదించిన ఇతర నిర్ణయాలు..  
► వృద్ధులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి వయ వందన యోజన(పీఎంవీవీవై)’ను మరో మూడేళ్ల పాటు(2023 మార్చ్‌ 31వరకు) పొడగించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 60 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వృద్ధులకు కనీస పెన్షన్‌ కచ్చితంగా లభించే ఈ పథకాన్ని ఎల్‌ఐసీ ద్వారా అమలు చేస్తున్నారు. 2020–21 సంవత్సరానికి రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ను 7.4 శాతానికి తగ్గించారు. గత సంవత్సరం ఇది 8 శాతంగా ఉంది. 2017–18 బడ్జెట్‌లో మొదట ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద సీనియర్‌ సిటిజన్‌ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు  పెట్టుబడి పెట్టవచ్చు.  

► రెండు నెలల పాటు సుమారు 8 కోట్ల మంది వలస కూలీలకు కేంద్రం వాటా నుంచి నెలకు 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికోసం రూ. 2982.27 కోట్లను ఫుడ్‌ సబ్సీడీ కింద, రూ. 127.25 కోట్లను రవాణా, ఇతర ఖర్చుల కింద కేటాయించారు.
 

మరిన్ని వార్తలు