పీఎల్‌ఐ పథకాలకు కేబినెట్‌ ఆమోదం

22 Mar, 2020 04:52 IST|Sakshi

దేశీయంగా ఎలక్ట్రానిక్, వైద్య పరికరాల తయారీకి ప్రోత్సాహం

వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు ఓకే

న్యూఢిల్లీ: దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి రూ.3,420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్‌సెంటివ్‌ (పీఎల్‌ఐ) పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో రూ.400 కోట్లతో మెడికల్‌ డివైజ్‌ పార్క్స్‌ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. పీఐఎల్‌ పథకం ద్వారా వచ్చే అయిదేళ్లలో రూ.68,437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చునని కేంద్రం అంచనా వేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా ఆయుష్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. వీటి ఏర్పాటుకు రూ.3,399.35 కోట్లు అవుతాయని అంచనా. ఈ  భేటీ వివరాలను మంత్రి జవదేకర్‌ వెల్లడించారు.

ఎలక్ట్రానిక్‌ కంపెనీలకు రూ.40,995 కోట్లు
ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కంపెనీలకు రూ.40,995 కోట్ల ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్‌సెంటివ్స్‌ను ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిసింది. మేకిన్‌ ఇండియా హబ్‌ను రూపుదిద్దడం కోసం ఎలక్ట్రానిక్, మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీకి వచ్చే అయిదేళ్లలో రూ.41వేల కోట్లు కేటాయించనున్నారు. దీంతో ఆయా రంగాలకు ఆర్థికంగా ఊతం వచ్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి రూ. 1,061 కోట్లు కేటాయించింది.

అత్యవసర మందులు, పరికరాలు అందుబాటులో
కరోనా నేపథ్యంలో అత్యవసరమైన మందులు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.14వేల కోట్లను మంజూరు చేసిందని మోదీ తెలిపారు. ఫార్మా సంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. అవసరానికి సరిపడిన ఆర్‌ఎన్‌ఏ డయాగ్నోస్టిక్‌ (కోవిడ్‌ను గుర్తించే) కిట్‌లను ఉత్పత్తి చేయాలని కోరారు. మందులు, పరికరాలను అవసరాల మేరకు తయారు చేయడంతోపాటు నూతన పరిష్కారాలను కనుగొనాలని కోరారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గాను రూ.14వేల కోట్ల విలువైన పథకాలను ఆమోదించామని మోదీ అన్నారు.

మరిన్ని వార్తలు