రబీ పంటలకు మద్దతు ధర పెరిగింది

3 Oct, 2018 18:59 IST|Sakshi
గోధుమకు పెరిగిన కనీస మద్దతు ధర (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : కిసాన్‌ క్రాంతి మార్చ్‌ అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచే ప్రతిపాదనను నేడు కేబినెట్‌ ఆమోదించింది. దీంతో గోధుమల మద్దతు ధర క్వింటాకు 105 రూపాయలు పెరిగి, ప్రస్తుతం క్వింటా 1,840 రూపాయలుగా ఉంది. గోధుమతో పాటు మరో ఐదు రకాల పంటలకు కూడా కనీస మద్దతు ధర పెరిగింది. 

కాగా జూలై నెలలోనే 14 రకాల ఖరీఫ్‌ పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రబీ పంటలకు కూడా కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రకటించింది. సెప్టెంబర్‌ నెలలో 20 శాతం లోటు వర్షపాతం, నీటి నిల్వలు పడిపోవడంతో, ఈ సీజన్‌లో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని కేంద్రం నిర్ణయించి, ఈ ప్రకటన చేసినట్టు తెలిసింది. అంతేకాక మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో, రైతులను ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లు అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో కిసాన్‌ క్రాంతి ర్యాలీ. వీటన్నింటికీ తలొగ్గి కేంద్రం రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచిందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు