కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్‌

23 Nov, 2018 05:14 IST|Sakshi
కర్తార్‌పూర్‌ గురుద్వార్‌

ఇకపై గన్నీ సంచుల్లోనే ఆహార ధాన్యాల ప్యాకింగ్‌

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: భారత్‌–పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్‌దాస్‌పూర్‌ నుంచి ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారిడాక్‌కు ఈ నెల 26న రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్‌ నిర్మిస్తామని పాక్‌ ప్రకటించింది. గురువారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం, ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్‌ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, కశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్న అనంతర పరిణామాలపై కేబినెట్‌ క్లుప్తంగా చర్చించింది.  నానక్‌ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా కేబినెట్‌  నిర్ణయాల్లో కొన్ని..

► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా డేరాబాబా నానక్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కేంద్రం నిధులతో ఆధునిక వసతులతో ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు. ∙పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్‌ను భారత్‌ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్‌ ఏర్పాటు.  ∙చారిత్రక సుల్తాన్‌పూర్‌ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్‌ కాంప్లెక్స్‌’ ఏర్పాటు. సుల్తాన్‌పూర్‌ లోధి రైల్వేస్టేషన్‌ స్థాయి పెంపు. ► భారత్‌–పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులకు పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలోనే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్‌ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలిæ గురుద్వారా ఏర్పాటైంది.
► ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు.
► ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు–2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ కౌన్సిల్స్‌ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్‌ వంటి 53 వృత్తులు వస్తాయి.  
► అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్‌ చేయాలనే ప్రతిపాదనకు ఓకే. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్‌ చేయాలి.

మరిన్ని వార్తలు