ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

24 Jun, 2020 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌కు‌ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.  బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ని​ర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ మాట్లాడుతూ.. దేశంలో అర్బన్‌ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. అన్ని కో ఆపరేటివ్‌ బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో 1,482 కో ఆపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నట్టు చెప్పారు. 

ఆర్బీఐ పరిధిలోకి తేవడం వల్ల ఆ బ్యాంకుల్లోని 8.6 కోట్ల మంది ఖాతాదారులకు సొమ్ముకు భద్రత కల్పించినట్టు అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. మరోవైపు పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి చెప్పారు. ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించినట్టు తెలిపారు. పాస్‌పోర్ట్‌ జారీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హరియాణా ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. 

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు..

  • ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు
  • అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
  • ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో 6 నెలలు పొడిగింపు
  • జనవరి 31, 2021 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం
మరిన్ని వార్తలు