పంట బీమాపై కేంద్ర కేబినెట్ చర్చ

7 Jan, 2016 06:27 IST|Sakshi
పంట బీమాపై కేంద్ర కేబినెట్ చర్చ

న్యూఢిల్లీ: పంట బీమా పథకంపై కేంద్ర కేబినెట్ చర్చించింది. ఈ విషయంలో కీలకమైన ప్రీమియం విషయంపై పలువురు మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చర్చించారు. గతేడాది వ్యవసాయ పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టగా.. అప్పడు దీనిపై జరిగిన చర్చలలో ప్రీమియం రేటు విషయంలో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆహార ధాన్యాలు, నూనె గింజటపై 2.5 శాతం, ఉద్యానపంటలకు 5 శాతం ప్రీమియమ్ చెల్లించాలని మంతిత్వ శాఖ ప్రతిపాదించగా.. అన్ని పంటలకు సమానంగా 1-1.5 శాతం ప్రీమియం ఉండాలని కొందరన్నారు. దీనిపై బుధవారం కూడా చర్చ జరిగింది.

వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కొత్త పంట బీమా పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చి.. దీని వల్ల రైతులకు కలిగే లాభాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. 2.2-5 శాతం ప్రీమియం చెల్లించటం వల్ల కేంద్రంపై రూ.8 నుంచి 11 వేల కోట్ల భారం పడుతుందనే భావన వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత భారం మోయటం కష్టమని ఆర్థిక శాఖ చెప్పిది. కాగా,  ప్రపంచ వ్యాక్సిన్ సంస్థ (గావీ) 2016-2021 మధ్యకాలంలో భారత్‌లో కొత్త టీకాలను ప్రవేశపెట్టే ఒప్పందానికి ప్రతిపాదన చేసింది. బుధవారం ప్రధానితో గావీ సీఈవో సేథ్ బర్క్‌లీ సమావేశమయ్యారు వచ్చే ఐదేళ్లలో భారత్‌కు 500 మిలియన్ డాలర్ల (రూ.3.3వేల కోట్లు) విలువైన టీకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోపక్క జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మోదీ తనను కలిసిన కశ్మీర్ యువతతో అన్నారు.

మరిన్ని వార్తలు