జేఏసీ రాజ్యాంగబద్ధతకు ఓకే

27 Dec, 2013 01:17 IST|Sakshi

న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా
వచ్చే సమావేశాల్లో లోక్‌సభ ముందుకు రానున్న బిల్లు
భవిష్యత్తులో జేఏసీలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే
జేఏసీ అమల్లోకి వస్తే ప్రస్తుత ‘కొలీజియం’ వ్యవస్థకు చెల్లు


 న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాలు, బదిలీల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్న ‘జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్(జేఏసీ)’కు రాజ్యాంగబద్ధత కల్పించే  బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. దీంతో ఈ కమిషన్ ఏర్పాటు, పనితీరుపై మరింత స్పష్టత రానుంది. రాజ్యాంగానికి సవరణలు చేసి కొత్తగా 124(ఏ), 124(బి) ఆర్టికల్‌లను చేర్చనున్నారు. జేఏసీ (న్యాయ నియామకాల కమిషన్) కూర్పును ఆర్టికల్ 124(ఏ), పనితీరును 124(బి)లు నిర్వచించనున్నాయి. భవిష్యత్తులో చేయబోయే చట్టాల నుంచి జేఏసీకి రక్షణ కల్పించేందుకు, సభ్యుల నియామకాలను, పనితీరును మార్చకుండా ఉండేందుకు రాజ్యంగబద్ధత కల్పించాలని బీజేపీతోపాటు న్యాయ నిపుణులు కూడా డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్లు-2013పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ సిఫారసు చేసింది. దీంతో జేఏసీకి రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఈ బిల్లును రానున్న లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేబినెట్ భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. పార్లమెంట్ ఆమోదం తెలిపితే భవిష్యత్తులో జేఏసీలో ఏమైనా మార్పు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను పూర్తిగా రదు ్దచేస్తూ దాని స్థానంలో జేఏసీని తీసువస్తున్న సంగతి తెలిసిందే. జేఏసీ-2013 బిల్లుతోపాటు, రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే ఇందులో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కమిషన్‌కు నేతృత్వం వహించాల్సిన నిబంధనను రాజ్యాంగంలో ప్రస్తావించాలని పలువురు సభ్యులు సూచించారు. దీంతో బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు. ఈ సంఘం చేసిన పలు సిఫారసులకు తాజాగా కేబినెట్ ఆమోదం తె లిపింది.

 జేఏసీలో ఎవరెవరుంటారు?

 జేఏసీకి భారత ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారు. ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖమంత్రి, పౌర సమాజానికి చెందిన ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. వీరిని ప్రధాని, సీజేఐ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. న్యాయ శాఖ కార్యదర్శి జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. దేశంలోని 24 హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, బదిలీలను పర్యవేక్షిం చేందుకు రాష్ట్రస్థాయిలో మరో జేఏసీ ఉండాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిపారసును న్యాయశాఖ తిరస్కరించింది. అలాగే జేఏసీలో పౌర సమాజం నుంచి ముగ్గురిని ఎంపికచేయాలన్న ప్రతిపాదనను కూడా తోసిపుచ్చింది.

 కేన్సర్‌పై పరిశోధనలకు ఎన్‌సీఐ

 హర్యానాలోని జజ్జార్‌లో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) క్యాంపస్‌లో ‘జాతీయ కేన్సర్ సంస్థ’ (ఎన్‌సీఐ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ.2,035 కోట్లు వెచ్చించి, 710 పడకల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 45 నెలల్లో దీన్ని నిర్మించనున్నారు. దేశంలో ఏటా కొత్తగా 11 లక్షల కేన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏడాదికి 5.5 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేన్సర్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు మరిన్ని పరిశోధనలు చే సేందుకు వీలుగా ఎన్‌సీఐని ఏర్పాటు చేస్తున్నారు.

 రైతుకు నాణ్యమైన విత్తనాలు

 స్టేట్ ఫామ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌సీఐ), నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(ఎన్ ఎస్‌సీ) సంస్థలను కలిపి కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలోని మారుమూల రైతులకు కూడా చౌక ధరలో నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఈ రెండింటినీ కలిపేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది.
 బీహార్, గుజరాత్ రోడ్లకు నిధులు: బీహార్, గుజరాత్‌లో రూ.1,912 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో బీహార్‌కు రూ.1,408.85 కోట్లు, గుజరాత్‌కు రూ.503.16 కోట్లు వెచ్చించనున్నారు.
 

మరిన్ని వార్తలు