తెలుగు రాష్ట్రాలకు కేబినెట్‌లో చోటు దక్కలేదా!

2 Sep, 2017 21:50 IST|Sakshi
తెలుగు రాష్ట్రాలకు కేబినెట్‌లో చోటు దక్కలేదా!

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కే అవకాశాలు లేవా.. తాజా పరిణామాలు గమనిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కే అవకాశాలు లేవు. తాజా విస్తరణలో మొత్తం 9 మందికి అవకాశం కల్పించనున్నారు. అయితే ఈ దఫా కేబినెట్‌లోకి సీనియర్ మాజీ అధికారులకు అవకాశం కల్పించనున్నట్లు శనివారం రాత్రి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేని పరిస్థితులలో ప్రస్తుతం సహాయ మంత్రి హోదాలో కొనసాగుతున్న నిర్మలా సీతారామన్‌కు తాజా మార్పు చేర్పులలో కేబినెట్‌ హోదా కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీలో కొత్త మంత్రుల పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

కొత్త మంత్రులు వీరే..
కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో శివ ప్రతాప్ శుక్లా (యూపీ), అశ్వినికుమార్ చౌబే (బిహార్), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్), అనంతకుమార్ హెగ్డే (కర్ణాటక), గజేంద్రసింగ్ షేఖావత్ (రాజస్థాన్), రాజ్ కుమార్ సింగ్ (మాజీ ఐఏఎస్), హర్దిప్ సింగ్ పూరి (మాజీ దౌత్యవేత్త), సత్యపాల్ సింగ్ (ముంబై మాజీ పోలీస్ కమిషనర్), అల్ఫాన్స్ (కేరళ) లు ఉన్నారు. వారికి ఏయే శాఖలు కేటాయిస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు.

తెలుగు రాష్ట్రాలకు నిరాశే..!
తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినా చివరికి కేంద్రం మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. ఓవైపు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామా అనంతరం ఇద్దరు తెలుగు వారికి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా తాజా జాబితా విడుదలతో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం కరువైంది. అన్యూహ్య పరిణామాలు జరిగితే తప్పా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు