నగదు బదిలీతో మిగులు తక్కువే!

12 Aug, 2016 22:11 IST|Sakshi
నగదు బదిలీతో మిగులు తక్కువే!

న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ.1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలు ద్వారా ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లుగా ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని...  వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది.

2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ.35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ పథకం కారణంగా జరిగిన మిగులుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లు మాత్రమే డీబీటీఎల్ కారణంగా మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనం కారణంగా వచ్చిందేనని పేర్కొంది.

మరిన్ని వార్తలు