రూ. 35 వేల కోట్లు వృధా!

7 Aug, 2017 18:03 IST|Sakshi
రూ. 35 వేల కోట్లు వృధా!

న్యూఢిల్లీ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క దిక్కులేని స్థితిలో రైతులు రొడ్డెక్కుతున్న దేశంలో, కూలిలేక నాలిలేక పిడుచగట్టిన నాలికలతో మూడోవంతు జనాభా పస్తులుంటున్న భారత దేశంలో... ఒక్క గోధుమలే ఐదు లక్షల టన్నులు కుళ్లిపోవడం, 35,701 కోట్ల రూపాయల డబ్బు వృధా అవడం ఎంత కష్టం, ఎంత నష్టం? ఇవి ఎవరో చెప్పిన లెక్కలుగావు. సాక్షాత్తు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ చూపిన లెక్కలు.

2011 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు దేశంలోని కేంద్ర ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం, నిస్సహాయం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్లిప్తత, నీతిబాహ్యానికి దేశం ఇంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని కాగ్‌ శుక్రవారం విడుదల చేసిన తన నివేదికలో విమర్శించింది. దేశంలోని రైతుల నుంచి కనీస మద్దతు ధర కింద గోధుమలు, బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏటా భారత ఆహార సంస్థ ప్రతిపాదిస్తున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వం  67 శాతం నిధులను మాత్రమే విడుదల చేస్తూ వస్తోంది. 2015–2016 ఆర్థిక సంవత్సరానికి 1.03 లక్షల కోట్ల రూపాయల నిధులను కోరగా కేంద్ర ప్రభుత్వం 67 శాతం నిధులను మాత్రమే విడుదల చేసింది.

దేశంలోని రైతుల నుంచి గోధుమలు, బియ్యాన్ని కనీస మద్దతు ధరకు కొని పౌర పంపిణీ పథకం ద్వారా వాటిని పేద ప్రజలకు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1964లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను ఏర్పాటు చేసింది. దేశంలో ఏటా గోధుమలు, బియ్యం దిగుబడిని దృష్టిలో పెట్టుకొని రైతుల నుంచి వీటి సేకరణకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు వేసి ఆ మేరకు నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలి. వాటిని పరిశీలించిన కేంద్రం తప్పనిసరిగా ప్రతిపాదనల్లో 95 శాతం నిధులను విడుదల చేయాలి. అయితే 2011–2012 నుంచి 2015–2016 ఆర్థిక సంవత్సరం వరకు ఎఫ్‌సీఐ ప్రతిపాదనల్లో 67 శాతం నిధులను మాత్రమే కేంద్రం విడుదల చేస్తూ వచ్చింది. ప్రభుత్వ గ్యారంటీపై ప్రభుత్వ బ్యాంకుల నుంచి వడ్డీలు తీసుకునేందుకు, బాండులు విడుదల చేసేందుకు కూడా కేంద్రం అనుమతించలేదు. కేంద్రానికి భారత ఆహార సంస్థ 11 లేఖలు రాయగా మొదటి పది లేఖలకు అసలు స్పందించలేదు. 11వ లేఖకు స్పందించినప్పటికీ విజ్ఞప్తులను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చుతూ  ప్రైవేటు వర్గాల నుంచి రుణాలు తీసుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చి ఊరుకుంది.


భారత ఆహార సంస్థ బ్యాంకుల ఆశ్రయించగా తక్కువ వడ్డీపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రాలేదు. పర్యవసానంగా ఈ ఐదేళ్ల కాలానికి ఆహార సంస్థ 11 నుంచి 12 శాతం వడ్డీపై రుణాలు తీసుకొంది. ఆ రుణాల మొత్తంపై వడ్డీ 2016 ఆర్థిక సంవత్సరం నాటికి 35,701 కోట్ల రూపాయలకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి ఉన్నట్లయితే కనీసం 1617 కోట్ల రూపాయలు కలసి వచ్చేవని కాగ్‌ కేంద్రంపై అక్షింతలు వేసింది. భారత ఆహార సంస్థ పనితీరు కూడా సవ్యంగా లేదని, గోధుమలు అధికంగా పండే పంజాబ్‌ రాష్ట్రంలో ఈ ఐదేళ్లకాలంలో ఐదు లక్షల టన్నుల గోధుమలు ఎందుకు పనికి రాకుండా కుళ్లిపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆహార సంస్థ చిట్టా పద్ధులు కూడా చిత్తు లెక్కల్లా ఉన్నాయని ఆక్షేపించింది. మార్గదర్శకాల ప్రకారం రైలు మార్గాలకు దగ్గరలో శీతల గిడ్డంగులను నిర్మించక పోవడం, వాటిని నిర్మాణాల్లో కూడా ఆలస్యం జరగడం, పూర్తయిన గిడ్డంగులను కూడా సకాలంలో స్వాధీనం చేసుకోక పోవడం పట్ల కూడా కాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

భారత ఆహార సంస్థ ప్రతిఏటా రైతుల నుంచి గోధమలు, బియ్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు వాటిని నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగులు ఏటేటా నిర్మిస్తూ పోవాలి. 2011–2012 సంవత్సరానికి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసే సామర్థ్యంగల శీతల గిడ్డంగులను భారత ఆహార సంస్థ అదనంగా నిర్మించాల్సి ఉండగా, 43 లక్షల టన్నుల సామర్థ్యంగల గడ్డంగులను మాత్రమే నిర్మించగలిగింది. అదే సంవత్సరానికి 192 గిడ్డంగుల్లో 165 గిడ్డంగుల నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ మరుసటి సంవత్సరానికిగాను వాటిని స్వాధీనం చేసుకోలేక పోయింది. పంజాబ్‌లో గోధమలను ఆరుబయట ఆరబోయటం వల్లనే ఐదు లక్షల టన్నులు కుళ్లిపోయాయి.

>
మరిన్ని వార్తలు