‘వారంలోగా తేల్చండి’

14 Jun, 2019 15:40 IST|Sakshi

కోల్‌కతా : ఆందోళన చేపట్టిన వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికను బేఖాతరు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యుల ఆందోళనతో ఆస్పత్రుల్లో చికిత్స లభించక వైద్యులు పడుతున్న ఇబ్బందులకు తెరదించాలని, వారంలోగా సమస్యను పరిష్కరించాలని కోల్‌కతా హైకోర్టు మమతా బెనర్జీ సర్కార్‌ను ఆదేశించింది.

సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని పీపుల్‌ ఫర్‌ బెటర్‌ ట్రీట్‌మెంట్‌ సంస్ధకు చెందిన కునల్‌ సహా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా వైద్యుల సమ్మెపై స్టే ఉత్తర్వులు జారీ చేయబోమని కోర్టు స్పష్టం చేసింది. ఇక జూనియర్‌ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏం చర్యలు చేపట్టారో వివరించాలని కోరింది. వివాదానికి కేంద్ర బిందువైన ఎన్‌ఆర్‌ఎస్‌ ఆస్పత్రిలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ 82 మంది వైద్యులతో పాటు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌, సూపరింటెండెంట్‌ రాజీనామా చేశారు.

మరోవైపు దీదీ సమీప బంధువు, కోల్‌కతా మేయర్‌ కుమార్తె వైద్యుల ఆందోళనలో పాలుపంచుకోవడం మమతా సర్కార్‌ను ఇరకాటంలో పడేసింది. కాగా ఎన్‌ఆర్‌ఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోగి బంధువులు జరిపిన దాడిలో ఇద్దరు వైద్యులు తీవ్రంగా గాయపడిన ఘటనను నిరసిస్తూ గత నాలుగు రోజులుగా బెంగాల్‌ అంతటా వైద్యుల నిరసన కొనసాగుతోంది. తమకు భద్రత కల్పించాలని కోరుతూ వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

మరిన్ని వార్తలు