మమతా బెనర్జీకి హైకోర్టు షాక్‌

21 Sep, 2017 15:56 IST|Sakshi

సాక్షి, కోల్‌కతాః మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. మొహర్రం సందర్భంగా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంపై నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. ప్రభుత్వం ఏకపక్షంగా ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయరాదని స్పష్టం చేసింది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహరం రోజుతో సహా అన్ని రోజులూ అర్థరాత్రి 12 గంటల వరకూ అనుమతించింది. నిమజ్జనానికి, తజియా ఊరేగింపుకూ రూట్‌ మ్యాప్‌ ఖరారు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పౌరుల హక్కులను ఆలోచనారహితంగా నియంత్రించరాదని ప్రభుత్వానికి చురకలు వేసింది. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేసిందని వ్యాఖ్యానించింది. అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా ఆదేశాలిస్తారా అంటూ నిలదీసింది.

ఐదు రోజుల దుర్గా పూజల అనంతరం విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ తివారీ నేతృత్వంలోని బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. కేవలం విజయదశమి, మొహర్రం ఒకేసారి రావడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఊహాగానాలతో ప్రభుత్వం చర్యలు చేపట్టరాదని పేర్కొంది. ఏదో జరుగుతుందని మీకు కల వచ్చినంత మాత్రాన దాని ఆధారంగా చర్యలు చేపట్టలేరంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌ 30 రాత్రి పదిగంటల తర్వాత విగ్రహాల నిమజ్జనాన్ని ప్రభుత్వం నిషేధించింది. మరుసటి రోజు మొహర్రం కావడంతో రోజంతా నిమజ్జనం జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు