పోలీసును వెంబడిస్తున్న లేగదూడ!

16 Apr, 2020 09:46 IST|Sakshi

బెంగళూరు : కర్నాటకలోని బ్యాప్పనహళ్లీ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ను వదిలి ఓ లేగదూడ ఉండలేకపోతోంది. తనను రక్షించి, తన ఆలనా పాలనా చూస్తున్న ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ రఫీని వదిలిపెట్టడం లేదు. మార్చి 30న అర్ధరాత్రి సమయంలో వేగంగా వస్తున్న కారును బ్యాప్పనహళ్లీ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెనక సీటులో కవర్‌తో చుట్టి ఉన్న లేగదూడను గమనించారు. వదిలేసి ఉన్న లేగదూడ రోడ్డుపైన ఒక్కటే కనిపించడంతో తమతోపాటూ తీసుకువచ్చామని వారు పోలీసులకు తెలిపారు. అయితే విచారణలో వారు చెప్పింది నిజమని తేలింది.

అదే రోజు రాత్రి లేగదూడని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురాగా, ఇన్‌స్పెక్టర్‌ రఫీ దానికి ముద్దుగా బీమా అని పేరు పెట్టి, పూర్తి బాధ్యతలు తానే చూసుకుంటున్నారు. లేగదూడకు దానాగా రోజుకు 20 లీటర్ల పాలు, పప్పు ధాన్యాలను ఇన్‌స్పెక్టర్‌ రఫీనే దగ్గరుండి అందిస్తూ ఇంట్లో సభ్యుడిలా చూసుకుంటున్నారు. బ్యాప్పనహళ్లీ నుంచి ట్రాన్స్‌ఫర్‌ అవ్వగానే బీమాని కూడా తనతోపాటే తీసుకెళతానని భావోద్వేగంతో రఫీ చెప్పారు. 

మరిన్ని వార్తలు