తెలుగోడి దయ కోసం...

12 Oct, 2014 21:47 IST|Sakshi
తెలుగోడి దయ కోసం...

* జాతీయ పార్టీల తరఫున ప్రచారబరిలో ఆంధ్ర, తెలంగాణ నాయకులు
* సినీనటులను నమ్ముకుంటున్న ఎన్సీపీ
* స్థానిక నాయకులతో నెట్టుకొచ్చేస్తున్న శివసేన
* తెలుగు ఓట్లు చీలడం ఖాయమంటున్న విశ్లేషకులు
సాక్షి, ముంబై: బహుముఖ పోటీ నెలకొన్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు సాధించేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే సత్తా ఉన్న తెలుగువారిని ఆకర్షించేందుకు సైతం పార్టీలు ప్రణాళికలు రచించుకుంటున్నాయి.

ఈ విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ముందున్నాయనే చెప్పవచ్చు. ముంబైతోపాటు పలు జిల్లాల్లో స్థిరపడిన తెలుగువారిని తమ పార్టీ అభ్యర్థుల వైపు ఆకర్షించేందుకు ఈ రెండు పార్టీలూ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలను ప్రచార బరిలో దింపాయి. వారు ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండేప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో తెలుగు నాయకులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు.

మహారాష్ట్రలో ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయిడు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు కృష్ణంరాజు, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, గురవారెడ్డి, కాంగ్రెస్  తరఫున పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయాష్కి గౌడ్ తదితర నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్, మరాఠ్వాడాలోని నాందేడ్, విదర్భలోని చంద్రాపూర్‌లతోపాటు ముంబై, భివండీలపై వీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలుగుతోందని చెప్పవచ్చు. ఫ్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలన్నీ దాదాపు తెలుగులోనే దర్శనమిస్తున్నాయి.
 
హామీల వర్షం...
తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నాయకులందరు హామీల వర్షం కురిపిస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంతోపాటు తెలుగు వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. తమ పార్టీలు అధికారంలోకి వస్తే తెలుగు ప్రజల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని కొందరు వాగ్దానాలు చేస్తుండగా తెలుగు భవనం, తెలంగాణా భవనం నిర్మిస్తామని మరి కొందరు చెబుతున్నారు. ముంబైలోని కామాటిపురా, వర్లీ, భివండీలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన బహిరంగ  సభలు, చిన్నచిన్న సభలకు సైతం భారీ సంఖ్యలో  తెలుగు ప్రజలు హాజరవుతుండడం విశేషం. దీంతో తెలుగు నాయకులు కూడా తమ పార్టీలే గెలుస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
 
ఎన్సీపీ తరఫున టాలీవుడ్ నటులు...
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపడంతో రాష్ట్రీయ పార్టీలు మరోమార్గాన్ని ఎంచుకున్నాయి. ముఖ్యంగా  తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్సీపీ టాలీవుడ్ నటులను ప్రచారంలోకి దింపింది.  ఆదివారం ఉదయం వర్లీతోపాటు కొన్ని ప్రాంతాల్లో తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచతమైన సోనూ సూద్ ఎన్సీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. రోడ్ షో నిర్వహించారు.

మరోవైపు ఆదివారం రాత్రి నిర్వహిం చిన బహిరంగ సభలో తెలుగు నటుడు ప్రకాష్ రాజ్ ప్రచారం చేసి ఎన్సీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మరోవైపు శివసేన స్థానిక తెలుగువారిని ప్రచారంలోకి దింపింది. తెలుగు వారి కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ శివసేనకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి.  
 
చీలనున్న తెలుగు ఓట్లు...?
వివిధ పార్టీలకు చెందిన తెలుగు నాయకులు చేస్తున్న ఎన్నికల ప్రచారం తెలుగు ఓటర్లపై ఎంతమేర ప్రభావం చూపనుందనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోతున్నారు.  ముఖ్యంగా భివండీ, ముంబైలోని వర్లీతోపాటు పలు నియోజకవర్గాల్లో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీకి చెందిన తెలుగు నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్సీపీ టాలీవుడ్ నటులను రంగంలోకి దింపింది. దీంతో తెలుగు ప్రజలు కీలకంగా ఉండే అనేక నియోజకవర్గాల్లో ఓట్ల చీలిపోయే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ముంబై, భివండీ లాంటి ప్రాం తాల్లో తెలుగు అభ్యర్థులెవరూ బరిలోలేరు. తెలుగు ఓట్లు కీలకంగా ఉన్న ప్రాంతంలో ఏదైనా పార్టీ తెలుగు అభ్యర్థిని బరిలోకి దింపి ఉంటే తెలుగు ఓట్లలో చీలికశాతం తక్కువగా ఉండే అవకాశం ఉండేది. కాని ప్రస్తుత పరిస్థితిలో తెలుగు ఓట్లు చీలిపోవడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు