ఫలితాలను ఐఐటీ నిలిపేయొచ్చా?: సుప్రీం

17 Jul, 2017 09:42 IST|Sakshi
ఫలితాలను ఐఐటీ నిలిపేయొచ్చా?: సుప్రీం

న్యూఢిల్లీ: విద్యార్థి చివరి సంవత్సరం ఫలితాలను నిలిపి ఉంచే హక్కు ఐఐటీలకు ఉందా? అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. జూనియర్‌ విద్యార్థినిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో ఐఐటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు చేపట్టింది. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, ఎల్‌. నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రం, ఐఐటీ–ఖరగ్‌పూర్‌లకు నోటీసులు జారీచేసింది. చివరి సంవత్సరం విద్యార్థి ఫలితాలను నిలిపేస్తే అతని కెరీర్‌కే ప్రమాదమని పిటిషనర్‌ తరఫు లాయర్‌ వాదించారు.

విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడని తేలడంతో సదరు విద్యార్థిని 2016 ఏప్రిల్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ క్యాంపస్‌ నుంచి బహిష్కరించారు. విద్యార్థి ఐఐటీకి బేషరతుగా క్షమాపణ చెబుతాడని, ఒకవేళ అతను ఉత్తీర్ణుడైతే ఫలితాలను విడుదల చేయాలని గతంలో అలహాబాద్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఆదేశించింది. అయితే ఐఐటీ ఆ ఉత్తర్వులను సవాలు చేయడంతో డివిజన్‌ బెంచ్‌ వాటిని తోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్నే సవాలు చేస్తూ విద్యార్థి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

మరిన్ని వార్తలు