రైలు పట్టాలపై నిద్రిస్తే ఎలా ఆపగలం?

16 May, 2020 06:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వస్థలాలకు తరలివెళుతోన్న వలస కార్మికులను నిలువరించడం, పర్యవేక్షించడం కోర్టులకు సాధ్యం కాదని, ఆపని చేయాల్సింది ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికులకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించేంత వరకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా వలస కార్మికుల కదలికలను ఆపలేమనీ, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలే తగిన చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, వలస కార్మికులు పట్టాలపైనే నిద్రిస్తోంటే ఎలా ఆపగలమని ప్రశ్నించింది. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం రహదారులపై నడచివెళుతోన్న వలస కార్మికులను ఆపడానికి ఏమైనా మార్గం ఉందా అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాని ప్రశ్నించింది. వలస కార్మికులకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారనీ, అంత వరకు వేచి ఉండకుండా కార్మికులు వెళుతున్నారని తుషార్‌ మెహతా కోర్టుకి తెలిపారు. వారిని కాలినడకన వెళ్ళొద్దని అధికారులు కోరగలరేగానీ, బలవంతంగా ఆపలేరన్నారు. 

మరిన్ని వార్తలు