ఈ పెళ్లి ఫొటోపై వివాదం, దుమారం

24 Mar, 2017 18:05 IST|Sakshi
ఈ పెళ్లి ఫొటోపై వివాదం, దుమారం

న్యూఢిల్లీ: కెనడా నుంచి వెలువడుతున్న పెళ్లి సంబంధాల పత్రిక ‘జోడీ’ కవర్‌ పేజీపై ప్రచురించిన ఫొటో వివాదాస్పదమైంది. ఆన్‌లైన్‌లో ముఖ్యంగా ‘ఫేస్‌బుక్‌’లో ఈ ఫొటోను సమర్థిస్తూ, అటు వ్యతిరేకిస్తూ కామెంట్లు పుంఖానుపుంఖంగా వచ్చి పడుతున్నాయి. ఓ తమిళ అమ్మాయి సంప్రదాయబద్ధంగా చీరకట్టుతో పెళ్లి కూతురులా ముస్తాబైనట్లు చూపితున్న ఫొటోలో ఓ అభ్యంతరకరమైన విషయం ఉంది. కాళ్లు నగ్నంగా కనిపించేలా ఆ చీరకట్టుకు పై నుంచి కింది వరకు చీలిక ఉండడమే అభ్యంతరమంతా.

‘తనుష్క సుబ్రమణియం’  మోడల్‌ పెళ్లి కూతురు దుస్తుల్లో చూపిన ఓ ఫొటోకు ‘విశాలంగా ఆలోచించు. మార్పును ఆహ్వానించు’  శీర్షికతో ప్రచురించారు. ఈ ఫొటో తమిళ సంస్కృతిని, సంప్రదాయాన్ని హేళన చేసినట్లుగా ఉందని కొంత మంది వ్యాఖ్యానించగా, ఆధునికతను, మార్పును సూచిస్తోందని మరికొందరు, స్త్రీవాదాన్ని ప్రతిబింబిస్తోందని మరికొంత మంది కామెంట్లు చేశారు. ఒళ్లు కనిపించకుండా దుస్తులు ధరించడం, ధరించకపోవడం వారి వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని అంగీకరిస్తామని, అయితే ఓ సంస్కృతిని అవమానించినట్లు చూపడాన్ని అనుమతించమని మరికొందరు వ్యాఖ్యానించారు. చూడలేకపోతే లేచివెళ్లి చీరను సరిచేయవచ్చంటూ చమత్కారాలు విసురుతున్నారు.

ఏదేమైనా ఈ ఫొటోపై చర్చ జరగడం ఆహ్వానించతగ్గ విషయమని,  ఈ ఫొటోలో కళాకోణంతోపాటు ఫెమినిజం కోణం ఉందంటూ మాగజైన్‌ నిర్వాహకులు సమర్థించుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు