ఆ మూడింటికే ఎక్కువ క్లెయిమ్‌లు

6 Feb, 2019 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఆయుష్మాన్‌ భారత్‌– ప్రధాన్‌మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) కింద కేన్సర్, కీళ్లు, గుండె సంబంధ వ్యాధులకే ఎక్కువ క్లెయిమ్‌లు అందినట్లు జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌హెచ్‌ఏ) తెలిపింది. గుండె వ్యాధుల ప్యాకేజీలో ఉన్న యాంజియో ప్లాస్టీ, స్టెంట్ల అమరిక వంటి ఖరీదైన వైద్య సౌకర్యాన్ని అత్యధికులు వినియోగించుకున్నారని వివరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంతో ఇప్పటి వరకు 10.8 లక్షల మంది లబ్ధి పొందారని పేర్కొంది.

ఈ పథకం కింద గుర్తించిన 14,756 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.1,041 కోట్ల విలువైన 8 లక్షల క్లెయిమ్‌లు అందగా రూ.808 కోట్ల విలువైన ఆరు లక్షల క్లెయిమ్‌లకు ఆమోదం తెలిపినట్లు ఎన్‌హెచ్‌ఏ వివరించింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, దగ్గర్లోని ఆస్పత్రుల వివరాలు, సహాయం పొందే విధానం వంటి వివరాలతో రూపొందించిన యాప్‌ను ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే ఈ యాప్‌ను 10,460 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఎన్‌హెచ్‌ఏ తెలిపింది. 

మరిన్ని వార్తలు