తల్లి చివరి కోరిక కోసం..

30 Jan, 2016 16:25 IST|Sakshi
తల్లి చివరి కోరిక కోసం..

కర్ణాటకలో కేన్సర్‌తో బాధపడుతున్న ఓ తల్లి.. తన కొడుకును ఓ చిత్రమైన కోరిక కోరింది. అతడు కూడా దాన్ని తీర్చడానికి కాస్త కష్టపడినా.. చివరకు తీర్చాడు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా మాకనడకు గ్రామ నివాసి లలితమ్మ కేన్సర్ బాధితురాలు. ఆ తల్లి వెల్లడించిన తన చివరి కోరికను ఆమె కుమారుడు కిరణ్‌కుమార్ నెరవేర్చాడు. జేడీఎస్ పార్టీలో కొనసాగుతున్న కిరణ్‌కుమార్ తల్లి లలితమ్మకు తాను చనిపోయేలోగా జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ.కుమారస్వామిని ఒకసారైనా చూడాలన్న కోరిక కలిగింది.

ఆ కోరిక గురించి కిరణ్‌కుమార్ తమ పార్టీ అధ్యక్షునికి ఫోన్‌లో వివరించగా, చెళ్లకెరె పర్యటనకు వచ్చిన ఆయన అందుకు సమ్మతించి, వెంటనే తల్లితో కలిసి చెళ్లకెరె బయలుదేరి రావాలని సూచించారు. దీంతో ఆయన చెళ్లకెరెలో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తర్వాత అక్కడకు వచ్చిన లలితమ్మను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుమారస్వామితో మాట్లాడినందుకు తనకు ఎంతో సంతోషం కలిగిందని లలితమ్మ ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు