సీరియల్‌ రేపిస్ట్‌కు మరణశిక్ష

24 Jul, 2017 21:54 IST|Sakshi
సీరియల్‌ రేపిస్ట్‌కు మరణశిక్ష

ఘజియాబాద్‌(ఉత్తరప్రదేశ్‌):
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిథారి సీరియల్‌ రేపిస్ట్‌తోపాటు అతని సహాయకుడికి సీబీఐ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2006లో ఓ మహిళ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అక్టోబర్‌ 5వ తేదీన నోయిడాలోని నిథారి గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను వ్యాపార వేత్త మొహిందర్‌ సింగ్‌ త్రిపాఠి పనిమనిషి సురేందర్‌ కోలి లోపలికి పిలిచాడు. అనంతరం యజమానితో కలిసి ఆమెపై అత్యాచారం చేయటంతోపాటు తలనరికి ఇంటి వెనుక పడేశారు. ఇదే విధంగా పలువురు చిన్నారులు, మహిళలపై దారుణాలు జరిపారు.

మహిళ అదృశ్యం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహిందర్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు జరపగా 16మందికి సంబంధించిన ఎముకలు, కపాలాలు కనిపించాయి. ఇందులో ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ దారుణం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా అదే సంవత్సరం డిసెంబర్‌ 29వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. ఈ మేరకు వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. సోమవారం ఈ కేసును విచారించిన స్పెషల్‌ జడ్జి పవన్‌ కుమార్‌ త్రిపాఠి నేరస్తులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు