కాలుష్యం మారింది..‘కాలింక్‌’గా!

14 Oct, 2017 04:31 IST|Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: కాలుష్య సమస్యకు బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు పరిష్కారాన్ని కొనుగొన్నారు. కాలుష్యాన్ని ఎలాగూ అరికట్టలేకపోతున్నాం.. అలాంటప్పుడు దానిని రోజూ ఉపయోగించే వస్తువుగా మార్చేస్తే ఎలా ఉంటుందన్న వారి ఆలోచన నుంచి పుట్టిందే ‘కాలింక్‌’.. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? అవును ఇది సరికొత్త ఆవిష్కరణే.. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అనిరుధ్‌ శర్మ, నిఖిల్‌ కౌషిక్, నితేష్‌ కధ్యాన్‌లు ‘చిక్కనైన నల్లటి సిరా’గా మార్చివేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

ఫ్యాక్టరీల చిమ్నీలు, జనరేటర్లు, కార్ల ఎగ్జాస్ట్‌ పైపుల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్ని, మసిని సేకరించి అనంతరం శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఇంక్‌ రూపంలోకి మారుస్తున్నారు. ఈ చిక్కటి ఇంక్‌ ప్రింటర్ల కాట్రిడ్జ్‌లు, స్క్రీన్‌ ప్రింటింగ్, చిత్రకళకు కాలిగ్రాఫి పెన్లు, వైట్‌బోర్డు మార్కర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. 2016 జూన్‌లో బెంగళూరులో నెలకొల్పిన ‘గ్రావికీ లాబ్స్‌’ ద్వారా ఈ ఇంక్‌ తయారీని కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక, ఇతర కాలుష్య వ్యర్థాల్ని శుద్ధిచేసి వర్ణ ద్రవ్యాలుగా, సిరాగా మార్చడంతో పాటు వివిధదేశాల్లో ప్రాచుర్యం కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీలోని రోడ్లకు ఈ ఇంక్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగించబోతున్నారు.ఈ ప్రక్రియలో ఉత్పత్తయ్యే వ్యర్థాల్ని కూడా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు రీసైకిల్‌ చేయడం విశేషం.  

విదేశాల్లోను ఎయిర్‌ ఇంక్‌కు ప్రాచుర్యం
ప్రస్తుతానికి వీధులు, కూడళ్లలో గోడలపై చిత్రాలు గీసే కళాకారులు, డిజైనర్లకు ఈ ఎయిర్‌ ఇంక్‌ ఎక్కువగా ఉపయోగపడుతోంది. విదేశాలతో సహా మన దేశంలోనూ గోడ, వీధి చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఇంక్‌ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అనిరుధ్‌ అండ్‌ కో ప్రయత్నిస్తోంది. కళారంగం ద్వారానే ఈ ఇంక్‌కు మరింత ప్రచారం తీసుకురావాలని భావిస్తున్నారు.

45 నిమిషాల కాలుష్యంతో 30 మి.లీ. ఇంక్‌
ఎయిర్‌ ఇంక్‌కు 2013లో అనిరు«ధ్‌శర్మ పెట్టినపేరు కాలింక్‌. వాతావరణంలోకి కాలుష్యం చేరకముందే దాన్ని ఎలా బంధించాలన్న అన్న ఆలోచన నుంచి వచ్చిందే కాలింక్‌ ప్రయోగం.తర్వాత అనిరుధ్, కౌషిక్‌లు కలిసి ‘సిలిండ్రికల్‌ మెటల్‌ కాంట్రాప్షన్‌’ను రూపొందించారు. వాటిని కార్ల పొగ గొట్టాలకు, పారిశ్రామిక చిమ్నీలకు ఏర్పాటుచేసి కాలుష్య రూపంలో ఉన్న ముడిపదార్థాన్ని సేకరించారు. 45 నిమిషాలు వెలువడే కాలుష్యంతో ఒక ఎయిర్‌ ఇంక్‌లో పట్టే 30 మిల్లీలీటర్ల ఇంక్‌ను తయారు చేయవచ్చని గుర్తించారు. కిక్‌ స్టార్టర్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించి ఎయిర్‌ ఇంక్‌ ఉత్పత్తికోసం పదిరోజుల్లో 14 వేల డాలర్ల(రూ.9 లక్షలు)కు పైగా సేకరించారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలతో సహా, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సంస్థలకు పెద్దమొత్తంలో కాలింక్‌ను సరఫరా చేసే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు కౌషిక్‌ చెప్పారు. పలువురు భారతీయ చిత్రకారులతో కూడా కలిసి పనిచేసే ఆలోచన ఉందని తెలిపారు.  గ్రావికీ ఆన్‌లైన్‌ స్టోర్స్‌ ద్వారా త్వరలో ఇంక్‌ను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వాటి కంటే ఎయిర్‌ ఇంక్‌ మార్కర్ల మన్నిక ఎక్కువని, ఇందులో వేరే రంగుల్ని జతచేసుకోవచ్చని కౌషిక్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు