‘వెర్రి వేషాలకు ఇది పరాకాష్టా.. శిక్షించండి’

3 Feb, 2020 15:20 IST|Sakshi

ఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ట్రాఫిక్‌ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాహనాలకు అన్ని పత్రాలు ఉన్నాయా..? లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లేని పక్షంలో కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానా విధిస్తున్నారు. అయితే, కొందరు కేటుగాళ్లు చలానా తప్పించుకోవడానికి ట్రాఫిక్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే వారిపై దాడులకూ యత్నిస్తున్నారు. తాజాగా వైరల్‌ అయిన ఓ వీడియోలో.. కారు డ్రైవర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌నే ఢీకొట్టాలని చూశాడు. అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఏకంగా 2 కిలోమీటర్లు కారు బానెట్‌పైనే లాక్కెళ్లాడు. ఢిల్లీలోని నంగోయి చౌక్‌ వద్ద గత నవంబర్‌లో ఈ ఘటన జరగగా.. తాజాగా వైరల్‌ అయింది.

సునీల్‌ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఓ కారును అడ్డగించాడు. వాహన పత్రాలు చూపించాలని చెప్పాడు. అయితే, కారు డ్రైవర్‌ పత్రాలు ఇవ్వకపోగా.. అడ్డు తప్పుకోవాలని కానిస్టేబుల్‌నే హెచ్చరించాడు. అతను వినకపోవడంతో.. కారు ముందుకు పోనిచ్చాడు. దీంతో కానిస్టేబుల్‌ ఒక్క ఉదుటున బానెట్‌పైకి చేరి.. వాహనాన్ని ఆపాలని మరోసారి హెచ్చరించాడు. అయినప్పటికీ.. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా దాదాపు 2 కిలోమీటర్లు అలాగే పోనిచ్చాడు. ఇదంతా ఆ కారులోనే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇక డ్రైవర్‌ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘వెర్రి వేషాలకు ఇది పరాకాష్టా అతని పై చర్యలు తీసుకోండి’ అని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు