కమిషనర్‌ ఇంటిముందు ధర్నా.. బీజేపీ నేతపై కేసు

5 Jan, 2020 11:46 IST|Sakshi

ఇండోర్‌: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గియపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు ఇండోర్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ, పలువురు బీజేపీ నాయకులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. 2019 డిసెంబర్‌ 10న ఇండోర్‌లో విధించిన నిషేధిత ఉత్తర్వులును ఉల్లఘించారని తహశీల్దార్‌ బిచోలి హప్సీ ఫిర్యాదు చేయటంతో పోలీసులు వీరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా వీరితోపాటు ఇండోర్‌-2 ఎమ్మెల్యే రమేష్‌ మెన్డోలా, ఇండోర్‌- 5 ఎమ్మెల్యే మహేంద్ర హార్డియా, నగర బీజేపీ అధ్యక్షుడు గోపీకృష్ణ నేమా పాటు మొత్తం 350 మందిపై ఇండోర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇండోర్‌ నగర సమస్యలపై చర్చించడానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గియా జనవరి 3న సంబంధిత అధికారులను కలవాలనుకున్నారు. దీని కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో ఆ అధికారులకు లేఖ కూడా పంపించారు. కానీ సమావేశానికి అధికారులు ఎవరూ హాజరుకాకపోవడంతో విజయ్‌వర్గియ తీవ్ర అసహనానికి గురయ్యారు. విజయవర్గియా అధికారుల తీరును నిరసిస్తూ ఎంపీ శంకర్ లాల్వాని, ఇతర బీజేపీ నాయకులతో ఇండోర్ కమిషనర్ ఆకాష్ త్రిపాఠి నివాసం ముందు ధర్నా చేశారు. ఈ ర్యాలీలో అధికారులను కైలాశ్‌ విజయ్‌వర్గియ బెదిరిస్తునట్లు ఉన్న వీడియో  బయటపడి వైరల్‌ అయిన విషయం తెలిసిందే. కాగా ఆ ర్యాలీ సందర్భంగా కైలాశ్‌ అధికారులను ఉద్దేశించి ‘మా సంఘ్‌(ఆరెస్సెస్‌) నేతలు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం. లేదంటే ఈ రోజు ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం’ అని బెదిరిస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది.
చదవండి: ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం!

మరిన్ని వార్తలు