కరుణ అంత్యక్రియలు ఎక్కడ?

8 Aug, 2018 01:37 IST|Sakshi
కరుణానిధికి నివాళులర్పించి స్టాలిన్‌తో మాట్లాడుతున్న మమతా బెనర్జీ.

మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కన స్థలం ఇవ్వాలన్న డీఎంకే

న్యాయపరమైన చిక్కులున్నాయన్న సర్కారు

గాంధీ మండపంలో రెండెకరాలు ఇస్తామని ప్రకటన

అత్యవసరంగా మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే

తాత్కాలిక న్యాయమూర్తి ముందు హైడ్రామా

అర్ధరాత్రి వరకు వాదనలు.. ఉదయం 8 గంటలకు వాయిదా

సాక్షి, చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డీఎంకే పట్టుబడుతోంది. ఇందుకోసం ఏకంగా స్టాలినే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే.. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని  పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరీనా బీచ్‌లో స్మారకానికి న్యాయపరమైన చిక్కులున్నాయని అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో డీఎంకే మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్‌ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినా ఎటూ తేలలేదు. దీంతో విచారణ బుధవారం ఉదయం 8 గంటలకు వాయిదా పడింది. మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా పలువురు డిమాండ్‌ చేశారు. 

ప్రజాజీవితాన్ని మరిచారా?: స్టాలిన్‌
కరుణానిధి ప్రజా జీవితం, ఆయన రాజకీయాలకు చేసిన సేవలను గుర్తుంచుకుని మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతివ్వాలని స్టాలిన్‌ లేఖ రాశారు. సీఎం పళనిస్వామికి రాసిన ఈ లేఖలో.. కరుణానిధి రాజకీయ గురువైన అన్నాదురై స్మారకం పక్కన మౌజోలియం కాంప్లెక్స్‌ లోపల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలన్నారు. కరుణ మృతికి కొద్ది గంటల ముందు సీఎంను స్టాలిన్‌ కలిశారు.

అటు, ప్రభుత్వం పేర్కొంటున్నట్లుగా మెరీనా బీచ్‌లో కరుణ స్మారకానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందుల్లేవని న్యాయమూర్తికి డీఎంకే తరఫు లాయర్‌ వెల్లడించారు. సీఆర్‌జెడ్‌ (కోస్ట్‌ రెగ్యులేషన్‌ జోన్‌) పరిధిలోకి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదని న్యాయమూర్తికి ఆయన తెలిపారు. అన్నా సమాధి ఉన్న స్థలం కోస్టల్‌ జోన్‌ పరిధిలో లేదని, అది కూవం నదీ తీరంలో ఉన్నట్టు వివరించారు.

అన్నా సమాధి వద్ద కరుణానిధి సమాధి ఏర్పాటుకు అవకాశం ఉందని, అయితే, తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా తీరంలోని అన్నా సమాధి పక్కనే కేటాయించాలని కోరారు. అయితే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామి దాఖలుచేసిన పిటిషన్‌తో చిక్కులున్న కారణంగా న్యాయమూర్తి ముందు వాదనలు జోరుగా సాగాయి.


(మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు తమిళసర్కారు నో చెప్పడంతో బీభత్సం సృష్టిస్తున్న కార్యకర్తలు)

చిక్కులు తొలగిపోలేదు: ప్రభుత్వం
మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం కుదరదని.. మాజీ ముఖ్యమంత్రులైన చక్రవర్తి రాజగోపాలచారి, కే కామరాజ్‌ల స్మారకాలున్న గిండీ ప్రాంతంలోని గాంధీ మండపంలో రెండెకరాల స్థలం కేటాయిస్తామని ప్రభుతవం వెల్లడించింది. కరుణానిధి సిట్టింగ్‌ సీఎం కానందునే మెరీనాబీచ్‌లో అంత్యక్రియలకు అనుమతిచ్చేందుకు పళనిస్వామి నిరాకరించారని తెలిసింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు సీఎంలుగా ఉంటూ కన్నుమూసినందుకే వారికి సముద్రం ఒడ్డున స్మారకం నిర్మించారు.

ఎంజీఆర్, జయలలితలు కరుణానిధికి రాజకీయంగా బద్ధ శత్రువులు. ప్రభుత్వ నిర్ణయం తెలియడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వద్ద ఉన్న కార్యకర్తలు ఆగ్రహంతో బారికేడ్లు తెంచుకుని రోడ్లపైకి పరిగెత్తారు. పరిస్థితి చేయిదాటుతుందని ఊహించిన పోలీసులు డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టారు. మెరీనాలోనే కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కార్యకర్తలు చెన్నై నగరంలో పలుచోట్ల వాహనాలను తగులబెట్టారు.

మమతా బెనర్జీ నివాళి
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి చేరుకుని కరుణ భౌతికకాయానికి  అంజలి ఘటించారు. సినీనటుడు రజనీకాంత్‌ కూడా కరుణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ కరుణ మృతికి సంతాపం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం చెన్నైకి రానున్నారు.  

ప్రముఖుల సంతాపాలు
‘కరుణానిధి మరణం చాలా బాధించింది. ప్రజానేతగా, తమిళనాడు అభివృద్ధిలో భాగస్వామిగా కీలకపాత్ర పోషించారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి.  ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయాభివృద్ధికి కరుణ తన జీవితాన్ని అంకితం చేశారు’ –రాష్ట్రపతి కోవింద్‌

‘దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రముఖ నాయకుడు కరుణానిధి. ఆయన మరణం తీవ్ర విచారకరం. మొత్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి 56 ఏళ్లపాటు ఆయన తమిళనాడు శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు. ఐదుపర్యాయాలు ముఖ్యమంత్రిగా తమిళనాడుకు సేవలందించారు’.   –ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

‘కలైజ్ఞర్‌ కరుణానిధి ఇక లేరనే వార్త బాధాకరం. దేశంలోని అత్యంత సీనియర్‌ రాజకీయ నేతల్లో ఆయనొకరు. ఓ బలమైన మాస్‌లీడర్, గొప్ప ఆలోచనాపరుడు, మంచి రచయిత, పేదలు, అణగారిన వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతను కోల్పోయాం’  –ప్రధాని మోదీ

‘తమిళ ప్రజలకు కరుణానిధి అంటే ఎంతో ప్రేమ. ఆరు దశాబ్దాలపాటు ఆయన తమిళ, దేశ రాజకీయాలకు విశేష సేవలందించారు. ఆయన మరణంతో దేశం ఓ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయన మరణానికి చింతిస్తున్న కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’
–కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌

‘కరుణానిధి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. డీఎంకే నేతలు, కార్యకర్తలు, కలైజ్ఞర్‌ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. పాఠశాలలో చదివే రోజుల నుంచే ఆయన కళా రంగంలోనూ రాణిస్తూ, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు’  – తమిళనాడు సీఎం పళనిస్వామి
 
‘కలైజ్ఞర్‌ మృతి మరచిపోలేనిది. నా జీవితంలో ఇదో చీకటి రోజు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’.–ప్రముఖ నటుడు రజనీకాంత్‌

గొప్ప మానవతావాది: గవర్నర్‌ నరసింహన్‌
సాక్షి, హైదరాబాద్‌: కరుణానిధి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గొప్ప పరిపాలనా దక్షుడిని కోల్పోయిందని అన్నారు. కరుణానిధి గొప్ప మానవతావాది అని నరసింహన్‌ పేర్కొన్నారు.
భారత రాజకీయ రంగానికి తీరని లోటు: కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: కరుణానిధి మృతి పట్ల తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, క్రియాశీల నాయకుడిగా సేవలందించారన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. కరుణానిధి మరణం భారతదేశ రాజకీయ రంగానికి తీరని లోటు అని కేసీఆర్‌ అన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయాం: వైఎస్‌ జగన్‌
ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌కు కరుణానిధి మరణం వార్త తెలియగానే సంతాపం ప్రకటించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధిది ఒక విశిష్ట స్థానమని, సినిమా రచయితగానే కాకుండా ద్రవిడ రాజకీయాలను శాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణ అని జగన్‌ కొనియాడారు.

మరిన్ని వార్తలు