‘కులగణన’ దాచివేత మోసం

8 Jul, 2015 00:24 IST|Sakshi
‘కులగణన’ దాచివేత మోసం

ఎన్‌డీఏ సర్కారుపై దాడికి ఏకమవుతున్న విపక్షాలు
 

న్యూఢిల్లీ: సామాజిక, ఆర్థిక, కుల గణన-2011లో కుల గణన వివరాలను వెల్లడించకపోవటంపై మండిపడుతున్న విపక్షాలు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడిగా దాడి చేసే అవకాశముంది. కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే, ఎస్‌పీ, ఆర్‌జేడీ, జేడీయూ వంటి పార్టీలు ఈ అంశంపై ఏకతాటిపైకి వస్తున్నాయి. కుల గణన వివరాలను వెల్లడించకపోవటాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని.. ఈ వివరాలను ప్రజలకు వెల్లడించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంయుక్త వ్యూహరచనపై ఇతర ప్రతిపక్షాలతోనూ చర్చలు జరుపుతున్నామని.. జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ మంగళవారం చెప్పారు. సమాజంలో వివిధ సామాజిక బృందాల పరిస్థితిని అర్థం చేసుకునేందుకు, బలహీన, అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి అవసరమైన పరిష్కార మార్గాలను నిర్ణయించటం కోసం కుల గణన నిర్వహిస్తామని 2010లో అప్పటి ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా.. ఆ వివరాలను వెల్లడించకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఉన్నత తరగతి వారి సంఖ్యలు, వివరాలను విడుదల చేయక పోవటం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వం వాస్తవాలను దేశానికి చెప్పకుండా దాస్తోందని.. రిజర్వుడు తరగతుల వారికి కోటా  తగ్గించేందుకే ఇలా చేస్తోందని ఆరోపించారు.

బిహార్ ఎన్నికల్లో కుల గణన అంశం...
‘కులగణన’ను వెల్లడించకపోవటానికి, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని ఎన్‌డీఏ సర్కారు కొట్టివేసినా ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్న ఆర్‌జేడీ, జేడీయూ ఈ అంశంపై విస్తృత ప్రచారం చేయటం ద్వారా ఓబీసీ ఓట్లను సమీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు