పిల్లి కాదు ‘కరోనా పులా’ ..?

18 Feb, 2020 11:46 IST|Sakshi
చెన్నై హార్బర్‌కు వచ్చిన చైనా పిల్లి

చైనా నుంచి వచ్చిన చెన్నై నౌకలో చిత్రమైన పిల్లి

కంటైనర్ల మధ్య సింహాలు!

పుదుక్కోటై వ్యక్తి మృతిపై కరోనా అనుమానాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనాలో కరోనా వైరస్‌తో వందలాది ప్రజలు పిట్టల్లారాలిపోవడం మొత్తం ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది. తమ దేశంలోకి కరోనావైరస్‌ వ్యాపించకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జంతువుల నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో..చైనాలో నివసించే వ్యక్తులు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని భారత నావికాదళశాఖ గత నెల 11న ప్రకటన విడుదల చేసింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్‌ సరిహద్దుల నుంచి ఆకాశ, భూమార్గంలో జనవరి 15 తర్వాత భారత్‌లోకి రావడంపై కేంద్రం నిషేధం విధించింది. చైనాలోని భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు కరోనావైరస్‌ భయంతో తమిళనాడుకు వచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ అనుమానిత రోగుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి చెన్నైకి వచ్చిన ఒక నౌకలో పసుపు, తెలుపు రంగులతో కూడిన “స్టో వేవే’ జాతికి చెందిన ఒక పిల్లి బోనులో కనుగొన్నారు. చైనా నుంచి వచ్చిన కంటైనర్లను హార్బర్‌ ప్రవేశద్వారం వద్ద కొన్నిరోజుల క్రితం కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలున్న ఆ కంటైనర్లో బోనులో ఉంచిన పిల్లి బయటపడింది. ఎంతో బలహీనంగా ఉన్న ఆ పిల్లికి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఈ పిల్లిని ఎవరు ఎవరికి పంపారు? ఎందుకోసం పంపారని కస్టమ్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు.

కంటైనర్ల మధ్య సింహాల సంచారం
ఇదిలా ఉండగా హార్బర్‌ కంటైనర్ల నడుమ మూ డు సింహాలు సంచరిస్తున్నట్లు, సింహాల దాడి తో తీవ్రంగా గాయపడినట్లున్న ఒక యువకుని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సోమవారం ప్రచారం కావడం కలకలం రేపాయి. అంతేగాక తిరునెల్వేలీకి చెందిన ఒక యువకుడు విడుదల చేసిన ఆడియో కూడా భీతిల్లేలా చేసింది. ‘ఫోటోలు ఉన్న మూడు సింహాలను చూసే ఉంటారు, చెన్నై ఎన్నూరులోని కామరాజర్‌ హార్బర్‌లోనే ఇవి సంచరిస్తున్నాయి. ఇరుక్కు అడవుల నుంచి వచ్చాయా లేక చైనా నౌక నుంచి చేరుకున్నాయా, కంటైనర్లలో తెచ్చి వదిలిపెట్టారా అని అధికారులు తేల్చాల్సి ఉంది. ఆదివారం లోడు ఎత్తుతుండగా ఈ మూడు సింహాలను చూసాను. కంటైనర్‌ లారీ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితిలోనూ రాత్రివేళల్లో కిందికి దిగవదు’ అని అతడు పేర్కొన్నాడు.

కరోనావైరస్‌ అనుమానితుని మృతి
పుదుక్కోటై జిల్లా అరంతాంగికి చెందిన శక్తికుమార్‌ (42) చైనాలో హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. పచ్చకామెర్లు సోకడంతో ఇటీవల సొంతూరుకు చేరుకుని చికిత్స పొందుతున్నాడు. చైనా హోటల్‌లో ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం కుదుటపడేలోగా వెళ్లిపోయాడు. మరలా తీవ్ర అనారోగ్యానికి గురై ఈనెల 4వ తేదీన అరంతాంగికి వచ్చాడు. మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 15వ తేదీన మరణించాడు. శక్తికుమార్‌ సంగతి వైద్యశాఖకు తెలియకపోవడంతో సాధారణ రోగిలా మధురై ఆసుపత్రిలో చేరి ప్రాణాలు విడిచాడు. కరోనా వైరసే అతని ప్రాణాలను బలిగొందని ప్రచారం జరగడంతో  ప్రజలు భీతిల్లుతున్నారు. చైనా నౌకలో వచ్చిన పిల్లిని వెనక్కు పంపాలని కేంద్ర నౌకాయానశాఖ మాజీ మంత్రి జీకే వాసన్‌ హార్బర్‌ అధికారులను కోరారు.  

మరిన్ని వార్తలు