ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాక గానీ.. తెలిసిరాలేదు!

8 Dec, 2015 16:58 IST|Sakshi
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాక గానీ.. తెలిసిరాలేదు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో అది వాహనదారులకు నరకం చూపించే రోడ్డు. ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌లో ఎవ్వరైనా గంటలు, గంటలు మగ్గిపోవాల్సిందే. ఆ నరకం ఏ స్థాయిలో ఉంటుందో తాజాగా సాక్షాత్తు ఓ కేంద్రమంత్రికి రుచి చూపించింది. రెండు గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌లో మగ్గిపోయిన ఆ కేంద్రమంత్రికి అసలు సమస్య తెలిసిరావడంతో 24 గంటల్లో పరిష్కారం ఏంటో కనుగొనండంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వివరాలివి..

కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాత్రి  ఢిల్లీ శివార్లలోని గుర్గావ్-మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్‌ పై ప్రయాణించారు. విమానాశ్రయానికి వెళ్లాలంటే ఈ ఫ్లైఓవర్‌ మీదుగానే వెళ్లాలి. కానీ దానిపై వాహనాల రాకపోకలు స్తంభించడంతో ఆయన రెండు గంటలపాటు మగ్గిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో కంగుతిన్న గడ్కరీ జాతీయ హైవే అథారిటీ అధికారులకు ఫోన్ చేసి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడకుండా 24 గంటల్లో తన ముందు ప్రతిపాదనలు పెట్టాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.

మొత్తానికి గడ్కరీ ఢిల్లీలో ట్రాఫిక్  సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'ఢిల్లీ ట్రాఫిక్ గురించి మేం అధ్యయనం చేస్తున్నాం. దీనిపై 15 రోజుల్లో నివేదిక రానుంది. ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయే ప్రదేశాలను మేం గుర్తించనున్నాం. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి కూడా తెలియజేసి.. దాదాపు ఆరు నెలలు, ఏడాదికాలంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మేం సంయుక్తం చర్యలు తీసుకుంటాం' అని గడ్కరీ విలేకరులకు చెప్పారు.
 

మరిన్ని వార్తలు