యస్‌ బ్యాంక్‌ కేసు: ఏడు చోట్ల సీబీఐ దాడులు

9 Mar, 2020 13:11 IST|Sakshi

ముంబై : యస్‌ బ్యాంక్‌ కేసుకు సంబంధించి ముంబైలో బ్యాంక్‌ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌, ఇతరులకు సంబంధించిన ఏడు చోట్ల సీబీఐ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. రాణా కపూర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆరేకేడబ్ల్యూ డెవలపర్స్‌, దోయిత్‌ అర్బన్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బాంద్రా కార్యాలయ ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. యస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి సంబందించి సీబీఐ ఈనెల ఏడున యస్‌ బ్యాంక్‌ మాజీ చీఫ్‌ రాణా కపూర్‌, ఆయన కుటుంబానికి చెందిన దోయిత్‌ అర్బన్‌ వెంచర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ కపిల్‌ వాధ్వాన్‌ తదితరులపై నేరపూరిత కుట్ర, 420 సహా పలు సెక్షన్ల కింద సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

చదవండి : రంగంలోకి సీబీఐ

యస్‌ బ్యాంక్‌ అక్రమంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఆర్థిక సాయం చేసేందుకు కపిల్‌ వాద్వాన్‌ ఇతరులతో కలిసి రాణా కపూర్‌ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, ప్రతిగా తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు బారీ లబ్ధి పొందారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. కాగా సీబీఐ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో గతంలోనే ఈడీ దాడులు చేపట్టింది. యస్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ రాణా కపూర్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. మరోవైపు రాణా కపూర్‌ను ముంబై కోర్టు ఈనెల 11 వరకూ ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే.

చదవండి : ముడుపుల కోసం షెల్‌ కంపెనీలు..

మరిన్ని వార్తలు