చిదంబరానికి ఢిల్లీ కోర్టు షాక్‌!

14 Sep, 2019 04:00 IST|Sakshi

ఈడీకి లొంగిపోయేందుకు చిద్దూ సరెండర్‌ పిటిషన్‌

తిరస్కరించిన న్యాయస్థానం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం(73)కు మరోసారి షాక్‌ తగిలింది. తీహార్‌ జైలు నుంచి బయటపడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ఢిల్లీలోని ఓ కోర్టు తిరస్కరించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కస్టడీకి అప్పగించాలని చిదంబరం శుక్రవారం ఓ న్యాయస్థానంలో సరెండర్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. దీంతో చిదంబరం దాఖలుచేసిన సరెండర్‌ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ దాన్ని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల తీరుపై చిదంబరం తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ తీవ్రంగా మండిపడ్డారు. చిదంబరాన్ని మరింత వేధించేలా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో సీబీఐ న్యాయస్థానం చిదంబరాన్ని సెప్టెంబర్‌ 19 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
 
సరైన సమయంలో అరెస్ట్‌ చేస్తాం: ఈడీ
ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన అవినీతి కేసులో చిదంబరం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ‘చిదంబరం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయలేరు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేముందు కొన్ని అంశాల్లో మేం దర్యాప్తును పూర్తిచేయాల్సి ఉంది.

కనీసం ఆరుగురు వ్యక్తులను విచారించాకే మేం చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోగలం. ఎందుకంటే ఈ అక్రమ నగదు చెలామణి కేసు దేశాన్ని దాటి విస్తరించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో చిదంబరం అరెస్ట్‌ తప్పనిసరి. దాన్ని మేం సరైన సమయంలో చేపడతాం. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఓ నిందితుడు విచారణ సంస్థను ఆదేశించలేడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం విచారణ సంస్థదే. మేం చిదంబరాన్ని అరెస్ట్‌ చేశాక, అప్పటివరకూ సేకరించిన ఆధారాల్ని ఆయనముందు పెడతాం’ అని చెప్పారు.

చిదంబరాన్ని వేధించాలనే: సిబల్‌
ఈ ఏడాది ఆగస్ట్‌ 20–21 తేదీల మధ్య చిదంబరాన్ని అరెస్ట్‌ చేసేందుకు ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తెలిపారు. ‘కానీ ఇప్పుడు ఈడీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్‌ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఆయన మరింతకాలం జ్యుడీషియల్‌ కస్టడీలోనే కొనసాగేలా, బాధపెట్టేలా ఈడీ అధికారులు దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు’ అని సిబల్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, చిదంబరం దాఖలుచేసిన సరెండర్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతను ఎప్పుడు అరెస్ట్‌ చేయాలన్నది ఈడీ విచక్షణాధికారానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ సందర్భంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) నుంచి అనుమతుల కోసం భారీగా ముడుపులు చేతులుమారాయని సీబీఐ కేసు నమోదుచేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు