సీబీఐ కస్టడీకి..చిదంబరం

23 Aug, 2019 03:53 IST|Sakshi
కోర్టు విచారణ తర్వాత చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు

26 వరకు నిర్బంధంలో ఉంచేందుకు న్యాయస్థానం అనుమతి

లోతైన దర్యాప్తు కోసం కస్టడీ అవసరమని భావిస్తున్నామన్న కోర్టు

చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదన్న సొలిసిటర్‌ జనరల్‌

గంటన్నరసేపు వాడివేడిగా వాదనలు

రోజూ అరగంటసేపు కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు అవకాశం

తిరిగి సీబీఐ హెడ్‌క్వార్టర్‌కు కేంద్ర మాజీ మంత్రి తరలింపు

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల (ఆగస్టు 26 వరకు) సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో.. గురువారం మధ్యాహ్నమే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. అది సాయంత్రం వరకు పొడిగించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం గంటన్నరసేపు న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ చౌహాన్‌ ఇరువర్గాల వాదనలు విన్నారు. పదే పదే అవే ప్రశ్నలతో విసిగిస్తున్నారని చిదంబరం తరపు న్యాయవాదులు కపిల్‌ సిబల్, సింఘ్వీలు పేర్కొనగా.. కీలకమైన ప్రశ్నలకు ఆయన ఉద్దేశపూర్వకంగానే సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ వాదించారు. వాదనల తర్వాత.. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని నాలుగురోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు చిదంబరాన్ని సీబీఐ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు.

న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య బుధవారం అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరంకు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ఆయనను ఆగస్ట్‌ 26 వరకు(నాలుగు రోజులు) సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ‘చిదంబరంపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. లోతైన దర్యాప్తు అవసరం. సంబంధిత పత్రాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అందువల్ల కస్టడీలో ఉంచి విచారణ జరపడం తప్పనిసరని విశ్వసిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ కుహార్‌ స్పష్టం చేశారు.

చిదంబరంను కొత్తగా అడిగేందుకు సీబీఐ వద్ద ప్రశ్నలేవీ లేవని, బుధవారం ఉదయం గతంలో విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని, అందువల్ల కస్టడీ అవసరం లేదని చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన వాదనను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజు అరగంట పాటు చిదంబరంను ఆయన కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కాగా, చిదంబరం అరెస్ట్‌పై రాజకీయం మరింత వేడెక్కింది. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేం కాదని, ఈ కేసులో చార్జిషీటు వేసేందుకు అవసరమైన ఆధారాలు సీబీఐ వద్ద లేవని కాంగ్రెస్‌ ఆరోపించింది. చట్టం తనపని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొంది.

జవాబులను దాటవేస్తున్నారు..  
ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన, అరెస్ట్‌ నుంచి తక్షణ ఊరట కల్పించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. హైడ్రామా అనంతరం బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిదంబరంను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న సీబీఐ గెస్ట్‌హౌజ్‌లో ఆ రాత్రి ఉంచారు. గురువారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పలు దఫాలుగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే, చాలా ప్రశ్నలను చిదంబరం దాటవేశారని, కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిదంబరం ఖండించిన కొన్ని అంశాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఆయనకు చూపడంతో.. ఆయన మౌనం దాల్చారని వెల్లడించాయి.

అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పటిష్ట భద్రత మధ్య చిదంబరంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తి, చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్‌ సిబల్, అభిషేక్‌ మను సింఘ్వీ తదితరులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కోర్టులో దాదాపు గంటన్నరకు పైగా వాడి వేడి వాదనలు కొనసాగాయి. చిదంబరం కస్టడీ అవసరం లేదని, ఆయన బెయిల్‌కు అర్హుడని సిబల్, సింఘ్వీ వాదించగా.. కేసుకు సంబంధించిన మరింత లోతైన కుట్ర మూలాలను వెలికి తీసేందుకు, చిదంబరం దగ్గరున్న రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కనీసం 5 రోజుల కస్టడీ అవసరమేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఆ వాదనలను తిప్పికొట్టారు. అనంతరం తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయమూర్తి.. సాయంత్రం 7 గంటల సమయంలో చిదంబరంను 4 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం చిదంబరంను మళ్లీ సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు.

వాదనలు ఇలా..
సిబల్, సింఘ్వీ (చిదంబరం తరఫున) 

► ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ.. చిదంబరం కొడుకు కార్తి సహా బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్టైన వ్యక్తి కార్తికి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన భాస్కర్‌ రామన్‌. ఆయన బెయిల్‌పై ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ వేరే కేసులో జైలులో ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి వారు బెయిల్‌పై ఉన్నట్లే భావించాలి.

► విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్‌ఐపీబీ)కి అనుమతులు ఇచ్చింది సీనియర్‌ అధికారులు. వారెవ్వరినీ అరెస్ట్‌ చేయలేదు.

► బెయిల్‌ మంజూరు అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమే.

► చిదంబరం విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ కూడా చెప్పడం లేదు.

► ఈ కేసు అంతా అప్రూవర్‌ గా మారిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన విషయాలపైనే ఆధారపడి ఉంది.

► తాను ఏం వినాలనుకుంటోందో.. అదే చిదంబరం చెప్పాలని సీబీఐ కోరుతోంది. అది సాధ్యం కాదు.

► జవాబులు దాటవేస్తున్నారనే కారణం చూపి కస్టడీ కోరడం సరికాదు.

► కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కస్టడీ లోకి తీసుకోవాలి. ఈ కేసులో అలా అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన అంశాలేవీ లేవు.

► చిదంబరంను గతంలో విచారణ సందర్భంగా అడిగిన పాత ప్రశ్నలనే బుధవారం కూడా మళ్లీమళ్లీ అడిగారు.

► సీబీఐ చెప్పేవన్నీ వాస్తవాలే అని అనుకోకూడదు.

► ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నట్లయితే తమకు అందజేయాలని కోరుతూ చిదంబరంకు సీబీఐ లేఖ రాస్తే సరిపోయేది.
 

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ (సీబీఐ తరఫున)

► చిదంబరం సరిగ్గా సమాధానాలివ్వలేదు. కొన్నింటికి డొంకతిరుగుడు సమాధానాలిచ్చారు. విచారణలో సీబీఐకి సహకరించలేదు కనుక కస్టడీ అవసరం.

► చిదంబరంతో సీబీఐ నేరాన్ని ఒప్పించడం లేదు.. కేసు మూలాలను తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తోంది.

► ఈ కుంభకోణంలో ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రలో చిదంబరం భాగస్వామి.  

► ఇది చాలా సీరియస్‌ కేసు. ఇందులో తెలివైన వాళ్లు చాలామంది ఇన్వాల్వ్‌ అయి ఉన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లలేకపోతే మాకు వైఫల్యమే ఎదురవుతుంది.

► గతంలో కార్తిని కూడా కస్టడీలోకి తీసుకునే విచారణ జరిపాం.

► చిదంబరం చాలా తెలివైనవాడు. ఈ కేసు విచారణలో సహకరించకుండా ఉండేందుకు ఆయనకు చాలా మార్గాలున్నాయి.

► ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఓపెన్‌ కోర్టులో బహిరంగంగా వెల్లడించలేం.

► చట్టం ముందు అంతా సమానమే.

► చిదంబరం తరఫున సమర్థులైన న్యాయవాదులున్నారు. కాబట్టి ఆయన సొంతంగా వాదించుకోవాల్సిన అవసరం లేదు.

► చిదంబరం ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. నగదు అక్రమ చలామణికి సంబంధించి ఈ కేసు గొప్ప ఉదాహరణ అని స్పష్టమవుతోంది అని ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. చిదంబరం ప్రధాన నిందితుడనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయంది.

► ఈ కేసులో చోటు చేసుకున్న క్విడ్‌ ప్రోకొ విషయాలు, కుట్ర అంశాలు తేలాల్సి ఉంది. ఆధారాలను చిదంబరం ముందు ఉంచి ప్రశ్నించాల్సి ఉంది. అందువల్ల ఆయన కస్టడీ చాలా అవసరం.

4 గంటలు
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో గురువారం ఉదయం దాదాపు 4 గంటల పాటు చిదంబరంను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతులు, ఐఎన్‌ఎక్స్‌ మీడియా ప్రమోటర్లు పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలతో పరిచయం, వారితో జరిపిన సమావేశాలు, కార్తికి చెందిన చెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్వాంటేజ్‌ స్ట్రాటెజిక్‌ సంస్థ.. తదితర విషయాలపై డెప్యూటీ ఎస్పీ ఆర్‌ పార్థసారథి నేతృత్వంలోని అధికారుల బృందం ఆయనను లోతుగా ప్రశ్నించింది.

అయితే, వారి ప్రశ్నలకు చిదంబరం సూటిగా జవాబివ్వలేదని, చాలా ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలను దాటవేశారని, మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదే కేసుకు సంబంధించి చిదంబరంను గత సంవత్సరం కూడా ఒకసారి ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడి గెస్ట్‌హౌజ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సూట్‌ నంబర్‌ 5ను ఆయనకు కేటాయించారు. గురువారం ఉదయం అల్పాహారం అనంతరం 10.20 గంటల సమయంలో ఇంటరాగేషన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భవనంలోకి మీడియాను కూడా పరిమితంగానే అనుమతించారు.   
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు


కోర్టు ముందు భారీ బందోబస్తు


కోర్టు విచారణ తర్వాత చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు


చిదంబరంను కోర్టుకు తీసుకొస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్న దృశ్యం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు