ఆర్జేడీ అధినేతకు మరోసారి భారీ ఎదురుదెబ్బ

7 Jul, 2017 10:47 IST|Sakshi
ఆర్జేడీ అధినేతకు మరోసారి భారీ ఎదురుదెబ్బ
లాలూ, భార్య రబ్రీదేవి, కుమారుడు, మరో వ్యక్తిపై సీబీఐ కేసు
బిహార్‌ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతనెలలోనే మనీలాండరింగ్‌ కేసులో ఆయన కుటుంబంపై  ఆదాయపు పన్నుశాఖ బినామీ లావాదేవీల చట్టాన్ని ప్రయోగించగా.. తాజాగా నేడు(శుక్రవారం) హోటళ్ల టెండర్ల వ్యవహారంలో లాలూతో పాటు మరో ముగ్గురిపై సీబీఐ కేసు నమోదుచేసింది. 2006లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పురి ప్రాంతాల్లో హోటళ్ల టెండర్ల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏజెన్సీ రిపోర్టులు నివేదించాయి. ఈ కేసు నమోదుచేసిన వారిలో ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వియాదవ్‌, ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌లు ఉన్నారు.  
 
అంతేకాక ఆయన నివాసంలో ఈ ఉదయం సీబీఐ తనిఖీలు కూడా చేపట్టింది. ఢిల్లీ, పాట్నా, రాంచీ, పురి, గురుగ్రామ్‌తో సహా 12 ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు కూడా చేస్తోంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అంటే 12 ఏళ్ల క్రితం రైల్వేకు చెందిన రెండు హోటళ్లను ప్రైవేట్‌ హాస్పిటాలిటీ గ్రూప్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఈ విషయంపై సీబీఐ విచారణ కూడా చేపడుతోంది. హోటళ్లను ఎక్స్చేంజ్‌ చేయడం కోసం ఈ హాస్పిటాలిటీ గ్రూప్‌ పాట్నాలోని రెండు ఎకరాల విలువైన భూమిని లాలూ సంస్థలకు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీని ప్రభావం బిహార్‌ ప్రభుత్వంపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమితో బిహార్‌లో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో నితీష్‌ కుమార్‌, లాలూతో తెగదెంపులు చేసుకుంటారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.