నవభారత్ పవర్‌పై తొలి చార్జిషీటు

11 Mar, 2014 04:46 IST|Sakshi
నవభారత్ పవర్‌పై తొలి చార్జిషీటు

బొగ్గు కుంభకోణంలో దాఖలు చేసిన సీబీఐ
చార్జిషీటులో కంపెనీ డెరైక్టర్లు పి.త్రివిక్రమ్ ప్రసాద్, వై.హరీశ్‌చంద్ర ప్రసాద్‌ల పేర్లు
ఐపీసీ సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద అభియోగాలు
 మిగిలిన ఐదు చార్జిషీట్లు 28లోగా దాఖలు చేయూలన్న సుప్రీం

 
 న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో మొట్టమొదటి చార్జిషీటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాఖలయింది. సోమవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ కంపెనీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లు పి.త్రివిక్రమ్ ప్రసాద్, వై.హరీశ్‌చంద్ర ప్రసాద్‌లతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన గుర్తుతెలియని అధికారులు, ఇతరుల పేర్లను కూడా అందులో చేర్చింది. 2006-09 మధ్య బొగ్గు బ్లాకులు పొందేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మోసపూరితంగా వ్యవహరించడం వంటి ఆరోపణలను నవభారత్ ఎదుర్కొంటోంది.
 
  మరోవైపు ఈ కుంభకోణానికి సంబంధించి మిగిలిన ఐదు చార్జిషీట్లను ఈ నెల 28వ తేదీలోగా దాఖలు చేయూలని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. చార్జిషీట్ల దాఖలుకు మరింత సమయం కోసం దర్యాప్తు సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు జడ్జి మధు జైన్ ముందు నవభారత్ పవర్‌పై చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ..  భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అరుుతే అవినీతి నిరోధక చట్టం కింద ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారవర్గాల సమాచారం. 2012 సెప్టెంబర్ 3న దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను మాత్రం ఈ చట్టం కింద కూడా నమోదు చేయడం గమనార్హం. 2010లో నవభారత్ పవర్‌ను భారీ లాభాలకు  ఎస్సార్ పవర్ లిమిటెడ్‌కు విక్రయించినప్పటికీ చార్జిషీటులో ఎస్సార్ పేరు లేదని ఆ వర్గాలు వివరించారుు.
 
  బొగ్గు కేసుల పురోగతిపై సోమవారం సుప్రీంకోర్టులో వివరణ ఇవ్వడానికి కొన్ని గంటల ముందు సీబీఐ ఈ తొలి చార్జిషీటను దాఖలు చేసింది. గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ తన 32 పేజీల తుది నివేదికలో పేర్కొంది. కోట్లాది రూపాయల విలువైన ఈ కుంభకోణానికి సంబంధించి వివిధ సంస్థలు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు సహా మొత్తం 16 ఎఫ్‌ఐఆర్‌లు సీబీఐ నమోదు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, బొగ్గు శాఖ మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఆ శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ వంటివారు కూడా ఇందులో ఉన్నారు. నవభారత్‌తో పాటు స్టెర్లింగ్ ఎనర్జీ లిమిటెడ్, జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్, ల్యాంకో గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ స్టీల్ ఇండియూ లిమిటెడ్, రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్‌లకు ఒడిశాలోని బొగ్గు బ్లాకులు కేటాయించాల్సిందిగా స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. నవభారత్‌కు బొగ్గు గనులు కేటాయించాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం కూడా సిఫారసు చేసినట్లు పేర్కొంది.
 
 ఎందుకీ జాప్యం?
 చార్జిషీట్ల దాఖలులో జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం సీబీఐని నిలదీసింది. ఫిబ్రవరి 10న మూడువారాల్లోగా ఆరు కేసులకు సంబంధించిన చార్జిషీట్లు దాఖలు చేస్తామని చెప్పడాన్ని గుర్తుచేసింది. ఇప్పటికే నాలుగు వారాలు కావడం చాలా విచారకరమని పేర్కొంది. చార్జిషీట్ల దాఖలులో అసలు జాప్యం ఎందుకు చేయూలంటూ న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, మదన్ బి లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
 
 మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ కోరిన నేపథ్యంలో.. తొలుత మూడు వారాల సమయం ఇవ్వాలని భావించిన బెంచ్ చివరకు సీబీఐ విజ్ఞప్తిని మన్నించి ఈ నెల 28 వరకు గడువిచ్చింది. అలాగే సీబీఐ హిండాల్కో నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల తనిఖీకి అనుమతించాల్సిందిగా దర్యాప్తు సంస్థను ఆదేశించాలని కోరుతూ ఐటీ విభాగం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయూలని బెంచ్ సూచించింది.  
 
 72లో ఏర్పడిన నవభారత్
 విద్యుత్ ఉత్పాదన, ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, వ్యవసాయ సంబంధిత బిజినెస్‌లను నిర్వహిస్తున్న రాష్ట్ర కంపెనీ నవభారత్ వెంచర్స్ 1972లో ఏర్పాటైంది. డి.సుబ్బారావు, పి.పున్నయ్య, ఏఎస్ చౌదరి కలసి నవభారత్ ఫెర్రో అల్లాయ్స్ పేరుతో నెలకొల్పారు. ప్రస్తుతం ఇండియా సహా ఆగ్నేయాసియా, ఆఫ్రికాల్లో కార్యకలాపాలు విస్తరించడంతోపాటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లను సైతం చేపడుతోంది. 1975లో రాష్ర్టంలోని ఖమ్మం జిల్లా పాల్వంచలో తొలి ఫెర్రోసిలికాన్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఒడిషాలోని ఖరగ్‌ప్రసాద్‌లో క్రోమియం అల్లాయ్స్ ప్లాంట్ ఉంది.
 
  డెక్కన్ షుగర్స్‌ను విలీనం చేసుకోవడం ద్వారా 1980లో చక్కెర ఉత్పత్తిలోకి  ప్రవేశించింది. ఆపై సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించింది. రాష్ర్టంతోపాటు, ఒడిశా, జాంబియాలోనూ విద్యుత్ ప్లాంట్లను పెట్టింది. 2006లో నవభారత్ వెంచర్స్‌గా మా రింది. కంపెనీ చైర్మన్‌గా దేవినేని అశోక్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, త్రివిక్రమ్ ప్రసాద్ ఎండీగా ఉన్నారు. సోమవారం కంపెనీ షేరు 1.7% తగ్గి రూ. 156 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు