ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు

10 Jun, 2014 22:35 IST|Sakshi
ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు

రెండుమూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు
 
ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది. ముండే ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ముండే మృతి కేసును త్వరలో సీబీఐకి అప్పగించనున్నారని అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే మంగళవారం తెలిపారు.
 
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... ‘ఇవాళ ఉదయం(మంగళవారం) హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేశారు. ముండే బలిగొన్న ప్రమాదం గురించి మాట్లాడారు. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. రెండుమూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు వెలువడతాయని చెప్పారు. ముండే మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన వెంట భద్రతా సిబ్బంది ఎందుకు లేరు? చిన్నపాటి గాయానికే ఆయన ఎలా మరణిస్తారు? తదితర కోణాల్లో కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరముందని రాజ్‌నాథ్‌కు సూచించారు.
 
సంయమనం పాటించండి: పంకజ

తండ్రి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టమేనని, ఆయన అభిమానులు కూడా సంయమనం పాటించాలని ముండే కూతురు పంకజ రాష్ట్ర ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోడీపై తనకు పూర్తిగా విశ్వాసముందని, మరణం వెనుక ఏవైనా కుట్రలు దాగి ఉంటే అవి సీబీఐ విచారణలో బయటపడతాయన్నారు.

మరిన్ని వార్తలు