సుప్రీం ముందుకు ‘బోఫోర్స్‌’

3 Feb, 2018 01:55 IST|Sakshi

2005 నాటి హైకోర్టు తీర్పుపై సీబీఐ పిటిషన్‌

అటార్నీ జనరల్‌ సూచనతో.. 12 ఏళ్ల తర్వాత

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ కుంభకోణంపై 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ శుక్రవారం సుప్రీంలో పిటిషన్‌ వేసింది. కేసుకు సంబంధించి మరిన్ని స్పష్టమైన ఆధారాలు, కీలక సాక్ష్యాలతో ఈ పిటిషన్‌ వేసినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత అజయ్‌ అగర్వాల్‌ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. అగర్వాల్‌ వేసిన పిటిషన్‌లో ప్రతివాదిగా మరో పిటిషన్‌ వేయాలంటూ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ ఇటీవలే సీబీఐకి మౌఖికంగా సూచించారు.

పిటిషన్‌ వేసిన 90 రోజుల్లోనే సీబీఐ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో అది జరగలేదు. ఈ నేపథ్యంలో బోఫోర్స్‌ కేసుకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, సాక్షాలతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రూ.64కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్న ఈ కేసులో యూరప్‌ పారిశ్రామిక వేత్తలైన హిందూజా సోదరులతోసహా పలువురిపై సీబీఐ వద్ద పూర్తి ఆధారాలున్నట్లు సమాచారం. మే 31, 2005న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ సోధి ఈ కుంభకోణంలో సీబీఐ కేసును కొట్టేశారు. అంతకుముందు, 2004 ఫిబ్రవరి4న మరో జడ్జి జస్టిస్‌ జేడీ కపూర్‌. ఈ కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌ ప్రమేయం లేదంటూ నిర్దోషిగా ప్రకటించారు.  

‘బోఫోర్స్‌’ కథాకమామిషు..  
భారత ప్రభుత్వం స్వీడన్‌ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌ మధ్య నాలుగు వందల 155ఎంఎం హోవిట్జర్‌లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్‌ 16న స్వీడన్‌ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులకు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్‌ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఏబీ బోఫోర్స్‌ అధ్యక్షుడు మార్టిన్‌ అర్డ్‌బో, మధ్యవర్తులుగా ఉన్న విన్‌ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.

దీంతోపాటుగా 1982 నుంచి 1987 మధ్య పలువురు భారతీయ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అవినీతి, మోసానికి పాల్పడటం ద్వారా నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 1999 అక్టోబర్‌ 22న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో చద్దా, ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్‌కే భట్నాగర్, బోఫోర్స్‌ కంపెనీ, అర్డ్‌బోల పేర్లను పేర్కొంది. 2000, అక్టోబర్‌ 9 దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో హిందూజా సోదరుల పేర్లనూ పేర్కొంది. మార్చి4, 2011న సీబీఐ ప్రత్యేక కోర్టు ఖత్రోచీకి కేసునుంచి విముక్తి కల్పించింది. 2013 జూలై 13న ఖత్రోచీ మరణించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భట్నాగర్, చద్దా, అర్డ్‌బోలు కూడా చనిపోయారు.

మరిన్ని వార్తలు