ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి

21 Sep, 2017 07:07 IST|Sakshi
ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి

సీబీఐ అధికారుల తప్పటడుగు
విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి  వెళ్లబోయి
సిట్టింగు న్యాయమూర్తి ఇంట్లోకి అడుగుపెట్టిన వైనం
తప్పిదం గుర్తించి వెంటనే నిష్క్రమణ
హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆగ్రహం


భువనేశ్వర్‌ :
అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా సీబీఐ బృందాలు రాష్ట్రంలో పలు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి పూట కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక ఇల్లు బదులుగా మరో ఇంటిలోకి చొరబడి సీబీఐ గిరీ ప్రదర్శించారు. అంతే కథ అడ్డం తిరిగింది. అదో సిట్టింగు న్యాయమూర్తి అధికారిక నివాస భవనం. విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి వెళ్లబోయి సిట్టింగు న్యాయమూర్తి ఇంట్లోకి అడుగు పెట్టారు. తప్పిదం గుర్తించి వెంటనే సీబీఐ అధికారులు అక్కడ నుంచి నిష్క్రమించారు.

బుధవారం ఉదయం సరికి ఈ సంఘటన ప్రసారం కావడంతో ఒడిశా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో సిట్టింగు ఎమ్మెల్యే ప్రభాత్‌ రంజన్‌ బిశ్వాల్‌ చిట్‌ఫండ్‌ మోసాల్లో నిందితునిగా అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు బృందం మంగళవారం రాత్రి కటక్‌ మహా నగరంలో 3 వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా సీబీఐ అధికారులు పొరపాటుపడ్డారు.

విధుల బహిష్కరణ
సీబీఐ అధికారుల తప్పటడుగుపట్ల ఒడిశా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై జుడీషియల్‌ దర్యాప్తు నిర్వహించాలని పట్టుబట్టింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒడిశా హై కోర్టు బార్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. సమావేశంలో తీర్మానం మేరకు తక్షణమే విధుల్ని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. విధుల బహిష్కరణ తదుపరి సర్వసభ్య సమావేశం తీర్మానం వరకు నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బార్‌ అసోసియేషన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తీర్మానం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. సీబీఐ చర్యల పట్ల అసంతృప్తిని వివరించేందుకు రాష్ట్ర హై కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రతినిథి బృందం ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయింది. విషయాన్ని పూర్తిగా వివరించినట్టు అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కాళీ ప్రసాద్‌ మిశ్రా తెలిపారు.

జుడీషియల్‌ దర్యాప్తునకు డిమాండ్‌
అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా దాడులు నిర్వహించిన సీబీఐ బృందం రాష్ట్ర హై కోర్టు సిట్టింగు న్యాయమూర్తి సి.ఆర్‌.దాస్‌ ఇంట్లోకి చొరబడడం సంఘవిద్రోహంగా హై కోర్టు బార్‌ అసోసియేషన్‌ వ్యాఖ్యానించింది. ఈ విచారకర సంఘటనపై హై కోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన జుడీషియల్‌ దర్యాప్తునకు డిమాండ్‌ చేసింది. తప్పటడుగు వేసిన అధికారులు, సిబ్బందిని గుర్తించిన మేరకు వారి వ్యతిరేకంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో క్రిమినల్‌ ప్రొసీడింగ్సు చేపట్టాలి. బాధ్యుతలైన వారిని విధుల నుంచి సస్పెండు చేయడం అనివార్యంగా బార్‌ అసోసియేషన్‌ ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు