ఫేస్‌బుక్‌ డేటా దుర్వినియోగంపై విచారణ

27 Jul, 2018 04:51 IST|Sakshi

రాజ్యసభలో వెల్లడించిన మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని  ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతుందని కేంద్రం తెలిపింది. ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ గురువారం రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్ని కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఉల్లంఘించిందో? లేదో? సీబీఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఫేస్‌బుక్, కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు నోటీసులు జారీచేయగా,  డేటా చౌర్యం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్‌ బదులిచ్చిందని చెప్పారు. సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సమాచార కట్టడికి మార్గాలు కనుగొనాలని ఆ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు.

మనుషుల అక్రమరవాణా బిల్లు ఆమోదం
మనుషుల అక్రమ రవాణా నిరోధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్, సీపీఎం బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్‌ చేయగా, చట్టం చేయడానికి ఇప్పటికే ఆలస్యమైందని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ బదులిచ్చారు. బాధితులను దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తెస్తున్నామని, దోషులకు శిక్షలు పడే రేటు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, సాక్షులు, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు.

మూడేళ్లలో అధ్యాపక పోస్టుల భర్తీ
వర్సిటీలు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను మూడేళ్లలోగా భర్తీ చేయాలని వర్సిటీలను కేంద్రం ఆదేశించింది. ఆలిండియా సర్వే ఆన్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 2016–17 ప్రకారం దేశవ్యాప్తంగా 3,06,017 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రి జవడేకర్‌ చెప్పారు. వీటిలో 1,37,298 పోస్టులు పట్టణ ప్రాంతాల్లో, 1,68,719 అధ్యాపక పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

మహిళల సాధికారతకు కొత్త పథకం
ప్రజల భాగస్వామ్యం ఆధారంగా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘మహిళా శక్తి కేంద్ర’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర‡ రాజ్యసభకు తెలిపారు. 2017–20 మధ్యకాలంలో ఈ పథకం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. పంచాయితీ స్థాయి కార్యక్రమంలో భాగంగా 115 జిల్లాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థి వాలంటీర్లు గ్రామీణ మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తెచ్చిన పథకాలతో పాటు ఇతర సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారని కుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు