మూడోరోజూ సీబీఐ విచారణలో రాజీవ్‌ కుమార్‌ 

12 Feb, 2019 01:25 IST|Sakshi
రాజీవ్‌ కుమార్‌

శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంలో నిందితులను విచారణ చేస్తున్న సీబీఐ

షిల్లాంగ్‌: శారద చిట్‌ఫండ్‌ కుంభకోణానికి సంబంధించి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ కునాల్‌ ఘోష్‌ విచారణ నిమిత్తం సోమవారం షిల్లాంగ్‌లోని సీబీఐ ఎదుట హాజరయ్యారు. వరుసగా మూడు రోజులుగా రాజీవ్‌కుమార్‌ను రెండ్రోజులుగా కునాల్‌ ఘోష్‌ను సీబీఐ విచారిస్తోంది. ఘోష్‌ సోమవారం ఉదయం పది గంటలకు సీబీఐ కార్యాలయానికి హాజరుకాగా, గంట తర్వాత రాజీవ్‌ కుమార్‌ వచ్చారు. ఆదివారం కూడా వీరిద్దరినీ వేర్వేరుగా పలు కోణాల్లో ఎనిమిది గంటలపాటు ప్రశ్నించినట్లు సీబీఐకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంకు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ముగ్గురు సీబీఐ అధికారులు రాజీవ్‌ కుమార్‌ను శనివారం సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
 
సీబీఐ విచారణను పర్యవేక్షించేలా ఆదేశించలేం: సుప్రీం 
శారదా కుంభకోణం విచారణను ప్రత్యక్షం గా పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా తాము ఆదేశించలేమ ని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు