ఐపీఎస్‌ ఇంటికి సీబీఐ

27 Sep, 2019 07:41 IST|Sakshi
ఇటీవల ఓ కార్యక్రమంలో మీడియాతో ఐపీఎస్‌ అలోక్‌కుమార్‌ (ఫైల్‌)

అదనపు డీజీపీ అలోక్‌కుమార్‌ నివాసంలో సీబీఐ సోదాలు  

కీలక పత్రాలు, ఫోన్, పెన్‌డ్రైవ్‌ స్వాధీనం!  

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తొలి దాడి

కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో భగ్గుమన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సీబీఐ దూకుడు పెంచింది. సీనియర్‌ ఐపీఎస్, రౌడీలకు సింహస్వప్నమని పేరున్న అలోక్‌కుమార్‌ ఇంటి తలుపు తట్టింది. త్వరలో మరికొందరి ఇళ్లలోనూ సోదాలు జరగవచ్చని సమాచారం.  

కర్ణాటక, బనశంకరి: సంచలనాత్మక ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీబీఐ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అలోక్‌కుమార్‌ ఇంటిపై గురువారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో రెండుగంటల పాటు శోధించి పలు ముఖ్యమైన పత్రాలను, మొబైల్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నాలుగు నెలల కిందట అలోక్‌కుమార్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఫోన్‌ట్యాపింగ్‌ జరిగినట్లు ఆగస్టులో ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో ట్యాపింగ్‌ నిర్వహించారని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇది తీవ్ర సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి బీఎస్‌.యడియూరప్ప ఈ కేసును సీబీఐ అప్పగించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మద్రాస్‌రోడ్డులో కేఎస్‌ఆర్‌పీ అదనపు పోలీస్‌డైరెక్టరేట్‌ (ఏడీజీపీ) గా ఉన్న అలోక్‌కుమార్‌ నివాసంపై ఒక్కసారిగా సీబీఐ అధికారులు చేరుకున్నారు. నివాసంలో మూలమూలనా శోధించారు. ఆయన ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ తదితరాలను జల్లెడ పట్టారు. 

ట్యాపింగ్‌పై ప్రశ్నలు   
సోదాల సమయంలోనే ఒక సీబీఐ సీనియర్‌ అధికారి నేతృత్వంలోని అలోక్‌కుమార్‌ను విచారణ చేపట్టి సమాచారం రాబట్టారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు ఎందుకు పాల్పడ్డారు, కారణాలేమిటి? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో ఆయన పాత్ర కీలకం కావడంతో త్వరలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. 

అలా రచ్చ అయ్యింది  
ప్రస్తుతం నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న భాస్కర్‌రావ్, కమిషనర్‌ పోస్టు కావాలని పలువురు నాయకులతో ఫోన్లో మాట్లాడటాన్ని ట్యాప్‌ చేసి లీక్‌ చేశారు. ఆ టేపులో టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ట్యాపింగ్‌ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం మొదలైంది. అప్పట్లో అలోక్‌కుమార్‌ నివామైన నగర పోలీస్‌ కమిషనర్‌ బంగ్లా నుంచి ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అదికారుల పేర్లు కూడా వినబడుతున్నాయి. అలోక్‌కుమార్‌ కేఎస్‌ఆర్‌పీ ఏడీజీపీగా బదిలీ అయిన అనంతరం పెన్‌డ్రైవ్‌లో సుమారు 30 జీబీ వాయిస్‌ రికార్డింగ్‌లను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధిచి మొదట సీసీబీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో స్వయంప్రేరితంగా ఐపీసీ సెక్షన్‌ 72 ఐటీ యాక్టు, ఇతర సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో ఆధారాలన్నింటినీ సీబీఐకి అప్పగించారు. 

విచారణ జరగనీ: దేవెగౌడ  
జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ.దేవేగౌడ మాట్లాడుతూ.. సీబీఐ తన పని తాను చేస్తుందని, దీనిగురించి నేను ఎందుకు మాట్లాడాలని, ఎవరెవరిని విచారణ చేస్తుందో చేయనీ అని అన్నారు. హెచ్‌డీ.కుమారస్వామిని విచారిస్తారా? అన్న ప్రశ్నకు అందులో ఎవరు ఉన్నారో తనకు తెలియదని, ఊహాగానాలకు జవాబు ఇచ్చేది లేదని చెప్పారు.  

నాకేం భయం: కుమారస్వామి  
ట్యాపింగ్‌ కేసులో సీబీఐ విచారణపై తనకేమీ భయం లేదని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ.కుమారస్వామి అన్నారు. గురువారం బెంగళూరులో పార్టీ ఆఫీసులో పార్టీ ఎంపీల సమావేశంలో పాల్గొనే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల కేసులో ఎవరినైనా విచారిస్తే నేనెందుకు పట్టించుకోవాలి?, ఎవరెవరి హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగాయో వాటన్నింటిని మీదా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ దేశ న్యాయవ్యవస్థలో ఎవరు ఎవరినైనా విచారించవచ్చు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అలోక్‌కుమార్‌ సమర్థుడైన అధికారి అని కుమార కితాబిచ్చారు.  

మరిన్ని వార్తలు