ఆమ్నెస్టీ కార్యాలయంపై సీబీఐ దాడులు

15 Nov, 2019 20:23 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బెంగళూరు, ఢిల్లీలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించింది. దాడులపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ సీబీఐ అధికారులు ఆరుగురు ఇవాళ ఉదయం 8.30 గంటలకు బెంగళూరు ఆమ్నెస్టీ కార్యాలయానికి చేరుకున్నారని, సాయంత్రం అయిదు గంటల వరకు సోదాలు కొనసాగించారని తెలిపారు. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారీ వేధింపులకు గురవుతున్నామని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

తమ సంస్థ భారతీయ, అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొంది. గత ఏడాది కూడా విదేశీ మారకద్రవ్యాల ఉల్లంఘన (ఫెరా) కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. 2010లో ఫారన్‌ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) లైసెన్స్ రద్దు కేసుతో ముడిపడి ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు