కార్తీ చిదంబరంపై సీబీ‘ఐ’

17 May, 2017 07:26 IST|Sakshi
కార్తీ చిదంబరంపై సీబీ‘ఐ’

4 నగరాల్లో కార్తీ నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
ఐఎన్‌ఎక్స్‌ మీడియా నుంచి ముడుపులు స్వీకరించారని ఎఫ్‌ఐఆర్‌
- ఎఫ్‌ఐఆర్‌లో ‘ఐఎన్‌ఎక్స్‌’ యజమానులు ఇంద్రాణీ, పీటర్‌ ముఖర్జియా పేర్లు
- ఇది రాజకీయ కక్ష సాధింపే: కార్తీ
- నా గొంతు నొక్కేందుకే: పి.చిదంబరం


న్యూఢిల్లీ/ సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మెడకు మరో సీబీఐ కేసు చుట్టుకుంది. ఒకవైపు ఎయిర్‌సెల్‌–మ్యాక్సిస్‌ కేసు విచారణ కొనసాగుతుండగానే..  మరోవైపు ఒక మీడియా సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై మంగళవారం సీబీఐ ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై ఐటీ దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ఆర్థిక శాఖ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్‌ఐపీబీ)అధికారుల్ని కార్తీ ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఆ మేరకు నేరపూరిత కుట్ర, మోసం, అక్రమంగా ప్రతిఫలం పొందడం, ప్రభుత్వాధికారుల్ని ప్రభావితం చేయడం, నేరపూరిత ప్రవర్తన నేరాలపై సోమవారమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అనంతరం మంగళవారం ఉదయం నుంచి పొద్దుపోయేవరకూ చెన్నై, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లో 14 చోట్ల కార్తీ ఆస్తులపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
ఎఫ్‌ఐఆర్‌లో కార్తీపై సీబీఐ పలు అభియోగాలు మోపింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై పన్ను దర్యాప్తు కేసును ప్రభావితం చేసేందుకు కార్తీ చిదంబరం డబ్బులు అందుకున్నారని ఆరోపించింది. ‘కార్తీ పరోక్ష భాగస్వామిగా ఉన్న అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ లిమిటెడ్‌కు రూ.10 లక్షలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్పష్టంగా పేర్కొంది. ఎఫ్‌ఐపీబీతో మధ్యవర్తిత్వం కోసం ఫీజుగా ఈ మొత్తం చెల్లించారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్తీకి సంబంధమున్న కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా ఐఎన్‌ఎక్స్‌ గ్రూపు రూ.3.5 కోట్ల మేర ఇన్‌వాయిస్‌లు జారీచేసింద’ని సీబీఐ పేర్కొంది. కార్తీతో పాటు అతని కంపెనీ చెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్, ఐఎన్‌ఎక్స్‌ మీడియా యజమానులు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియాలు (ప్రస్తుతం ఇంద్రాణీ కుమార్తె షీనాబోరా హత్య కేసులో జైల్లో ఉన్నారు), ఐఎన్‌ఎక్స్‌ మీడియా, అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్, ఆ కంపెనీ డైరెక్టర్‌ పద్మా విశ్వనాథన్‌ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. తమకందిన విశ్వసనీయ సమాచారం మేరకు అన్నీ నిర్ధారించుకుని కేసులు నమోదు చేశామంది. ఆర్థిక శాఖ, ఎఫ్‌ఐపీబీ అధికారులపై కార్తీ ఒత్తిడి తెచ్చారని సీబీఐ పేర్కొన్నా.. ఆ అధికారుల పేర్లను మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు.

ఏ తప్పూ చేయలేదు: కార్తీ
‘నేనెలాంటి తప్పూ చేయలేదు. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేన’ని కార్తీ చిదంబరం ఆరోపించారు. తన కార్యాలయాలు, నివాసాల నుంచి సీబీఐ ఎలాంటి పత్రాల్ని స్వాధీనం చేసుకోలేదని, తనపై ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని పేర్కొన్నారు.

గొంతు నొక్కేందుకే..: చిదంబరం
తన కుమారుడే లక్ష్యంగా సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పి.చిదంబరం ఆరోపిం చారు. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, కాలమిస్టులు, ఎన్జీవోలు, పౌర సంస్థల విషయంలో చేసినట్లే నా గొంతు నొక్కడం, రాయకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. వెనక్కి తగ్గేది లేదు. పత్రికల్లో రాయడం కొనసాగిస్తా’ నని చిదంబరం స్పష్టం చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐపీబీలోని ఏ ఒక్క అధికారిపైనా సీబీఐ ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు.   

‘సన్‌’స్ట్రోక్‌కు మూల్యం తప్పదు: బీజేపీ
కేంద్రం తనను లక్ష్యంగా చేసుకుందన్న చిదంబరం ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఖండించారు. చిదంబరం తనయుడి కంపెనీకి ఎఫ్‌ఐపీబీ నిధులు ఎందుకిచ్చిందన్నది ఇక్కడ విషయమని, దానిపై స్పందించాలన్నారు. ‘సన్‌’స్ట్రోక్‌కు చిదంబరం మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇవి ప్రతీకార దాడులన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పం దిస్తూ... బీజేపీ ఎప్పటికీ చట్టం, స్వయంప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు.

అక్రమంగా రూ.305 కోట్ల సేకరణ
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్‌ఐపీబీ) నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మారిషస్‌ నుంచి ఐఎన్‌ఎక్స్‌ భారీగా పెట్టుబడులు సేకరించింది. కేవలం రూ. 4.62 కోట్లు మాత్రమే సేకరించాలని ఎఫ్‌ఐపీబీ, ఆర్థిక శాఖ షరతులు విధించినా.. వాటిని లెక్కచేయకుండా రూ. 305 కోట్లను విదేశీ పెట్టుబడుల రూపంలో అందుకుంది. విదేశీ పెట్టుబడుదారులకు ఒక్కోటి రూ.800ల విలువైన షేర్లను జారీ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరోపణలపై ఐఎన్‌ఎక్స్‌ స్పందిస్తూ.. ఎఫ్‌ఐపీబీ షరతుల మేరకే పెట్టుబడులు సేకరించామని తెలిపింది.

మరిన్ని వార్తలు