జైసింగ్‌ దంపతుల ఇళ్లపై సీబీఐ దాడులు

12 Jul, 2019 03:26 IST|Sakshi
ఇందిరా జైసింగ్, ఆనంద్‌ గ్రోవర్‌

స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు

ఢిల్లీలోని ఇల్లు, ఆఫీస్, ముంబై ఆఫీస్‌లోనూ సోదాలు

న్యూఢిల్లీ: ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్‌ గ్రోవర్‌లపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించింది. విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీలోని ఇందిరా జైసింగ్‌ ఇల్లు, జంగ్‌పురాలో లాయర్స్‌ కలెక్టివ్‌ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్‌లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ప్రకటించింది.

ఆనంద్‌ గ్రోవర్‌ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న లాయర్స్‌ కలెక్టివ్‌ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్‌ గ్రోవర్‌ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.32.39 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదిచ్చింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్‌పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్‌సీఆర్‌ఎ) ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

దీనిలో భాగంగానే గురువారం సోదాలు నిర్వహించింది. ఫిర్యాదులో ఇందిరను నిందితురాలిగా పేర్కొనలేదు. 2009–14లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ఇందిర పనిచేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇందిర, గ్రోవర్, లాయర్స్‌ కలెక్టివ్‌ తరఫున ఓ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును ఇందిర వాదిస్తుండడంతోనే ఇలాంటి దాడులు  జరుగుతున్నాయని సంయుక్త ప్రకటన పేర్కొంది.  

ఖండించిన రాజకీయ పార్టీలు..
సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. సీబీఐ దాడులను టీఎంసీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీలు మూకుమ్మడిగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ మేరకు వారంతా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.

మరిన్ని వార్తలు