ప్రణయ్‌రాయ్‌ ఇంటిపై సీబీఐ దాడులు

6 Jun, 2017 01:02 IST|Sakshi
ప్రణయ్‌రాయ్‌ ఇంటిపై సీబీఐ దాడులు

ఓ ప్రైవేటు బ్యాంకుకు నష్టం చేకూర్చారని అభియోగం
న్యూఢిల్లీ: రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించ కుండా ఓ ప్రైవేటు బ్యాంక్‌కు నష్టం చేకూర్చారన్న అభియోగంపై ప్రముఖ వార్తా చానల్‌ ఎన్‌డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్‌ రాయ్‌ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించింది.

ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధిక, వారికి చెందిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్, కొందరు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ సోమవారం ఈ దాడులు జరిపింది.ఢిల్లీలోని రెండు ప్రాంతాలు, డెహ్రాడూన్, ముస్సోరీల్లో తమ బృందాలు సోదాలు చేసినట్టు సీబీఐ ఎస్పీ సుజిత్‌కుమార్‌ తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలతో ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.48 కోట్లు నష్టం వాటిల్లగా.. పర్యవసానంగా ఆర్‌ఆర్‌పీఆర్‌ లాభం పొందిందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ఇది రాజకీయ దాడి: మీడియా స్వేచ్ఛను హరించి, దాని గొంతు నొక్కడానికి ప్రభుత్వం చేయించిన రాజకీయ దాడి ఇదని ఎన్‌డీటీవీ వెల్లడించింది. ఇలాంటి చర్యలతో అధికార పార్టీ నాయకులు తమను భయపెట్టలేరంది. ఐసీఐసీఐ నుంచి తీసుకున్న రూ.375 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదని సీబీఐ ఆరోపిస్తోందని, కానీ ఏడేళ్ల కిందటే ఆ మొత్తాన్నీ బ్యాంక్‌కు జమచేశామంది. ఇందు లో రాజకీయ జోక్యం లేదని, మీడియాకు చెందిన వారైనంతమాత్రాన తప్పు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ కూర్చోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు