డీకే ఆప్తుల ఇళ్లపై సీబీఐ దాడులు

1 Jun, 2018 02:58 IST|Sakshi

పాత నోట్ల మార్పిడి కేసులో సోదాలు

సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులపై గురువారం సీబీఐ దాడులు చేపట్టింది. బెంగళూరు, రామనగర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో అక్రమంగా నోట్లను మార్చినట్లు డీకేపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. 2016 నవంబర్‌ 14న కొందరు రూ.10 లక్షల పాత నోట్లను అక్రమంగా  రామనగరలోని కార్పొరేషన్‌ బ్యాంకులో మార్చారని సీబీఐ ఆరోపిస్తోంది.

ఆర్‌బీఐ నిబంధనలకు  విరుద్ధంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపించకుండా కొత్త రూ.2 వేలు, రూ.500 నోట్లను డీకే సోదరుల ఆప్తులు మార్చుకున్నట్లు 2017లో కేసు దాఖలైంది. దీనిపై కోర్టు వారెంటుతో వచ్చిన సీబీఐ అధికారులు డీకే సోదరుల సన్నిహితులైన శివానంద, నంజప్ప, పద్మనాభయ్యల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. సీబీఐ సోదాలపై ఎమ్మెల్యే డీకే శివకుమార్‌ మాట్లాడుతూ ఇలాంటి వాటికి భయపడనన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి లొంగదీసుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎవరూ ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరని చెప్పారు.

మరిన్ని వార్తలు