కోలుకుంటున్న ‘ఉన్నావ్‌’ బాధితురాలు

3 Sep, 2019 09:14 IST|Sakshi
ప్రమాదానికి గురైన ఉన్నావ్‌ బాధితురాలి కారు (ఫైల్‌)

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు కోలుకుంటోందని, ప్రాణాపాయం లేదని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ఆమెను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు జూలై 28న ఢీనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బంధువులు మరణించగా, బాధితురాలు, ఆమె లాయర్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఇటీవల లక్నో ఆసుపత్రి నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ సోమవారం బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఆమె లాయర్‌ ఇంకా కోలుకోకపోవడంతో అతడి వాంగూల్మాన్ని సీబీఐ ఇంకా తీసుకోలేదు. ఈ కేసులో నివేదికను ఈనెల 6న సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించనుంది.

బాధితురాలిని, ఆమె లాయర్‌ను రోడ్డు ప్రమాదంలో అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్, ఆయన అనుచరులు 30 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే బాధితురాలు కానీ, కుల్‌దీప్‌ సెంగార్‌ కానీ తనకు తెలియదని ఈ కేసులో పట్టుబడిన ట్రక్కు డ్రైవర్‌ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీనికి ముందు 2017లో రెండు వేర్వేరు సందర్భాల్లో కుల్‌దీప్‌ సెంగార్, ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి కుల్‌దీప్‌ సింగార్‌ జైలులో ఉన్నారు. అత్యాచార బాధితురాలి తండ్రిని గత ఏడాది ఏప్రిల్‌ 3న అరెస్టు చేయగా, ఏప్రిల్‌ 9న జ్యుడిషియల్‌ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. (చదవండి: 'ఉన్నావ్‌' నువ్వు తోడుగా)

మరిన్ని వార్తలు