బొగ్గు స్కాంలో దాసరి, జిందాల్, మధుకోడాకు కోర్టు సమన్లు

7 May, 2015 01:17 IST|Sakshi

న్యూఢిల్లీ: కోల్ గేట్ కుంభకోణానికి సంబంధించి బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా సహా 14 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. వారిని ఈ నెల 22వ తేదీన కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి భారత్ పరాశర్ ఆదేశించారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా జార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపునకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ... కేంద్ర మాజీ మంత్రి దాసరితో పాటు 15 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా పేర్కొంటూ ఏప్రిల్ 29న చార్జిషీటు దాఖలు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420, 409 కింద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు