‘చిదంబరం ఆధారాలు మాయం చేశారు’

27 Sep, 2019 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్‌ సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి  చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా చిదంబరం తరఫున కపిల్‌ సిబల్‌, సీబీఐ తరఫున తుషార్‌ మెహర్‌ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా.... ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాను చిదంబరం కలిశారు అనడానికి సాక్ష్యాలు లేవని కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది ఆయనను కలిసేవారని.. అయితే వారిలో ఇంద్రాణీ ఉన్నారో లేరోనన్న విషయం ఆయనకు గుర్తులేదని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా... ‘సీబీఐ విచారణలో భాగంగా చిదంబరం ఇంద్రాణి కలిసినట్లు తేలింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారు. రిజిస్టర్‌ను చిదంబరం మాయం చేయించారు’ అని తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. తాను చిదంబరాన్ని కలిశానని, ఈ మేరకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నానని ఆమె మెజిస్ట్రేట్‌ సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ ఇదివరకే కోర్టుకు వెల్లడించింది.

మరిన్ని వార్తలు